పోరు తెలంగాణమా! | Telangana State Political History after Freedom | Sakshi
Sakshi News home page

పోరు తెలంగాణమా!

Published Wed, Oct 24 2018 2:20 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Telangana State Political History after Freedom - Sakshi

హైదరాబాద్‌ రాష్ట్ర తొలి మంత్రివర్గ సభ్యులతో బూర్గుల రామకృష్ణారావు, మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌

భారతదేశం స్వాతంత్య్రం పొందిన.. ఏడాది తర్వాత (1948 సెప్టెంబర్‌ 17న) తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చింది. అప్పటివరకు పూర్తి రాచరిక పాలనలో మగ్గిన ఈ రాష్ట్రం.. ఆ తర్వాత కేంద్రం నియమించిన ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి పాలనలోకి వెళ్లింది. నాలుగేళ్ల తర్వాత.. అంటే 1952లో తొలిసారిగా నిజాం స్టేట్‌లో భాగంగా ఉన్న మహా రాష్ట్ర, కర్ణాటకల్లోని పలు ప్రాంతాలను కలుపుకుని తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీకి, కమ్యూనిస్టులకు హోరాహోరీ జరిగిన ఈ ఎన్నికల సమరంలో కాంగ్రెస్‌ అధికారం చేజిక్కించుకుంది. దేశవ్యాప్తంగా పటిష్టంగా కనిపించిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. అప్పటికే తమ పోరాటాల ద్వారా తెలంగాణ ప్రజల్లో తమదైన ముద్రవేసుకున్న మహామహులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. కమ్యూనిస్టు పార్టీ తరఫున బరిలో దిగిన రావి నారాయణరెడ్డి అయితే.. నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీతో లోక్‌సభకు ఎంపికయ్యారు. 1952నాటి ఈ ఎన్నికల విశేషాలను గమనిస్తే..
ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావుతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 

సాయుధ పోరాటం నుంచి ఎన్నికలకు..
తెలంగాణలో అరాచకాలకు పాల్పడ్డ రజాకార్లు, జమీందార్లకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం జరిపిన వామపక్ష, ప్రగతిశీల శక్తులు కమ్యూనిస్టు జెండా కింద ఏకమయ్యాయి. హైదరాబాద్‌ విమోచనం తర్వాత కూడా కమ్యూనిస్టు సంఘాలు అదే ఉద్యమస్ఫూర్తిని కొనసాగించాయి. దీని కారణంగా.. దేశవ్యాప్తంగా రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురులేని పరిస్థితులున్నప్పటికీ.. తెలం గాణలో మాత్రం కమ్యూనిస్టుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు క్షేతస్థాయిలో ఆర్థికంగా, ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగడం.. అప్రకటిత నిషేధం కొనసాగింపు వంటి పరిణామాలు కమ్యూనిస్టులకు ఇబ్బంది కరంగా మారాయి. దీంతో ఈ పార్టీ నాయకులు, ప్రగతి శీల నాయకులు, ప్రజాస్వామ్య వాదులు.. కమ్యూనిస్టు పార్టీ తరఫున కాకుండా ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) పేరిట 1952లో ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. రైతాంగ సాయుధ పోరాటం కారణంగా తెలంగాణలో పీడీఎఫ్‌కు బలమైన శక్తిగా అవతరించగా, కమ్యూనిస్టుల ప్రభావం లేని కన్నడ, మరాఠీ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఉమ్మడి హైదరాబాద్‌ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణలోని ప్రాంతాలతో పాటు రాయచూర్, గుల్బర్గా, బీదర్, ఉస్మానాబాద్, బీడ్, ఔరంగాబాద్, పర్భని, నాందేడ్‌ జిల్లాలను కలుపుకుని మొత్తం 175మంది సభ్యులతో హైదరాబాద్‌ శాసనసభ – హైదరాబాద్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన దరిమిలా హైదరాబాద్‌ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు 101 మంది 1956 డిసెంబర్‌ 3న ఏపీ శాసనసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

ద్విసభ్య నియోజకవర్గాలు
మొదటిసారి ద్విసభ్య నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. 1952లో హైదరాబాద్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఏర్పడినపుడు మొత్తం 33 ద్విసభ్య (ఒక జనరల్‌ సీటు, ఒక రిజర్వ్‌ సీటు కలిపినవి) నియోజకవర్గాలుండగా, వాటిలో 21 తెలంగాణ ప్రాంతం లోనే ఉండేవి. 1956లో ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడినపుడు 29 ద్విసభ్య నియోజకవర్గాలుండేవి. 1957లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ద్విసభ్య నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరిగింది. 1961లో ద్విసభ నియోజకవర్గాల రద్దు చట్టం అమల్లోకి రావడంతో ఈ విధానం రద్దయింది. దీంతో 1962 ఎన్నికల నుంచి ఏకసభ్య నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. 1952లో హైదరాబాద్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి (నిజాం స్టేట్‌ పరిధిలోని ప్రాంతాలకు) జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో సహా మొత్తం ఏడు జాతీయ పార్టీలు, ఏడు రాష్ట్ర పార్టీల అభ్యర్థులు పోటీచేశారు. జాతీయపార్టీల్లో ఆల్‌ ఇండియా భార తీయ జనసంఘ్, అఖిల భారతీయ హిందూ మహాసభ, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్, కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీ, అఖిల భారతీయ రామరాజ్య పరిషద్, అఖిల భారత షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్, సోషలిస్ట్‌ పార్టీలున్నాయి. రాష్ట్ర పార్టీల్లో హైదరాబాద్‌ స్టేట్‌ డిప్రెస్డ్‌ క్లాసెస్‌ అసోసియేషన్, ప్రజా పార్టీ (హెచ్‌ఎస్‌పీపీ), ఇండిపెండెంట్‌ లీగ్, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్, పెజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ, ఆల్‌ ఇండియా రిపబ్లికన్‌ పార్టీ, యునైటెడ్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్‌ ఉన్నాయి.

కార్మిక నేత మఖ్దూం ఓటమి..!
కమ్యూనిస్టు యోధుడు, సుప్రసిద్ధ కవి, కార్మికనేత మఖ్దూం మొహియుద్దీన్‌ 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ అసెంబ్లీ సీటు నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి మాసుమా బేగం చేతుల్లో 780 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొత్తం 45,195 ఓట్లకు గాను, 21,560 ఓట్లు పోలవగా అందులో మఖ్దూంకు 9,373 ఓట్లు వచ్చాయి. కార్మిక, కర్షక వర్గాల హక్కుల కోసం మఖ్దూం అలుపెరగని పోరాటం చేశా రు. నిరంకుశ నిజాం సైన్యం, రజాకార్లకు వ్యతి రేకంగా  చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, రైతు కూలీలు, ఇతరవర్గాల పేదలు జరిపిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక స్థానం దక్కింది. అలాంటి సాయుధ పోరాట ప్రకటనపై సంతకం చేసిన ముగ్గురు నేతల్లో మఖ్దూం (రావి నారాయణరెడ్డి, రాజ్‌బహదూర్‌ గౌడ్‌తో కలిసి) ఒకరు.

జలగం, కోదాటి పరాజయం
ఖమ్మం జిల్లా వేంసూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంగళరావు, మరో ఇండిపెండెంట్‌ కందిమళ్ల రామకృష్ణారావు చేతుల్లో 549 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మొత్తం 51,987 ఓట్లకు గాను 36,215 ఓట్లు పోల్‌ కాగా, వెంగళరావుకు 15,543 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత జలగం.. రాష్ట్ర హోం మంత్రిగా, ఏపీ సీఎంగా, కేంద్రమంత్రిగా వివిధ పదవుల్లో పనిచేశారు. ఇప్పగూడ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థి విఠల్‌రావు చేతిలో కాంగ్రెస్‌కు చెందిన కోదాటి నారాయణరావు 5,463 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో, స్వాతంత్య్ర సమరయోధుడిగా, గ్రంథాలయ ఉద్య మంలో.. నారాయణరావు క్రియాశీల భూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. పరిగి అసెంబ్లీ సీటు నుంచి కాంగ్రెస్‌ తరఫున షాజహాన్‌ బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌పై శాంతాబాయి రెండు నియోజక వర్గాల నుంచి పోటీచేశారు. కొల్లాపూర్‌లో పీడీఎఫ్‌ అభ్యర్థి అనంత రామచంద్రారెడ్డి చేతుల్లో ఓడిన ఆమె.. మక్తల్‌–ఆత్మకూరు ద్విసభ్య నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

వెల్లివిరిసిన మహిళా చైతన్యం
ఈ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది మహిళలు కూడా గెలుపొందడం.. ఆనాటి మహిళా చైతన్యాన్ని, సామాజికంగా, సాంఘికంగా అభ్యు దయ భావజాలం వెల్లివిరియడానికి నిదర్శనం. ఇందులో తెలంగాణ ప్రాంతం నుంచే ఆరుగురు న్నారు. వారిలోనూ ఇద్దరు ముస్లిం మహిళలు, ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి మరో మహిళ గెలుపొందడం గమనార్హం. హైదరాబాద్‌ స్టేట్‌లోని రాయచూర్‌ జిల్లా కొప్పళ స్థానం నుంచి మహాదేవమ్మ బస వన్నగౌడ ఇండిపెండెంట్‌గా గెలుపొందగా, ఔరంగా బాద్‌లోని వైజాపూర నుంచి ఆషాటి వాగ్మారే (కాంగ్రెస్‌) విజయం సాధించారు. 1956లో ఏపీలో విలీనమైన సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఆరుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

రావి నారాయణరెడ్డి రికార్డు
1952లో హైదరాబాద్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. హైదరా బాద్‌ స్టేట్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండేవి. ఇందులో నాలుగు ద్విసభ్య స్థానాలు (తెలం గాణలో మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, కర్ణాటకలో బీదర్‌) ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 17, పీడీఎఫ్‌కు 7, పీడబ్ల్యూపీ, ఎస్‌పీ, ఎస్‌సీఎఫ్, ఇండి పెండెంట్‌లకు చెరో స్థానం లభించాయి. ఈ ఎన్ని కల్లో నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీచేసిన.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని రావినారాయణరెడ్డి రికార్డు విజయాన్ని నమోదు చేశారు. ప్రధాని నెహ్రూ కంటే కూడా ఎక్కువ ఓట్లు సాధించారు. పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన  నారా యణరెడ్డికి 3,09,162 ఓట్లు వచ్చాయి. అలహాబాద్‌ (తూర్పు), కమ్‌ జౌన్‌పూర్‌ (పశ్చిమ)ల నుంచి ద్విసభ్య స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన నెహ్రూకు 2,33,571 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించిన రామానంద తీర్థ 1952 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గుల్బర్గా నుంచి గెలుపొందారు. సోషలిస్ట్‌ పార్టీ నుంచి సి.మాధవరెడ్డి ఆదిలాబాద్‌ నుంచి గెలి చారు. పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీచేసిన పెండ్యాల రాఘవరావు వరంగల్‌ నుంచి విజయం సాధించారు. ఆయన ఎంపీ సీటుకే కాకుండా మూడు అసెంబ్లీ సీట్లకు కూడా పోటీచేసి ఒక చోట ఓడిపోయారు.

గెలిచిన మహామహులు
1952 హైదరాబాద్‌ శాసనసభలో వివిధరంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, మహామహులుగా చెప్పుకోదగ్గవారు చాలామందే ఉన్నారు. వారి వివరాలను ఓసారి గమనిస్తే.. 

గోపాలరావు ఎగ్బోటే
1948 నుంచి 1951 వరకు న్యాయవాదిగా పనిచేసిన జీఎస్‌ ఎగ్బోటే.. 1952 ఎన్నికల్లో ముషీరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలుపొందారు. 1954– 56 మధ్యకాలంలో విద్య, స్థానిక ప్రభుత్వం, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేశారు. 1957లో మరోసారి ఏపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1962లో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1972లో హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
బూర్గుల రామకృష్ణారావు
హైదరాబాద్‌ స్టేట్‌ తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బూర్గుల రామకృష్ణారావు కాంగ్రెస్‌ టికెట్‌పై షాద్‌నగర్‌ నుంచి గెలుపొందారు. ఈయన దాదాపు నాలుగేళ్ల ఎనిమిది నెలల పాటు సీఎంగా కొనసాగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌.. రాజ్‌ప్రముఖ్‌ హోదాలో 1952 ఎన్నికల్లో గెలిచిన బూర్గులతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ హైదరాబాద్‌లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించిన బూర్గుల న్యాయ రంగంలో పేరుప్రఖ్యాతులు గడించారు. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ సంస్థాపక సభ్యుల్లో ఈయన ఒకరు. దేవరకొండలో జరిగిన మూడో ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు. మానవహక్కులపై ప్రజలను చైతన్యపరిచారు. రాష్ట్రంలో గ్రంథాలోద్యమ వ్యాప్తికి తీవ్రంగా కృషిచేశారు.

సురవరం ప్రతాపరెడ్డి
నాటి హైదరాబాద్‌ స్టేట్‌లో గ్రంథా లయ ఉద్యమానికి ఆద్యుడిగా నిలిచిన సురవరం ప్రతాపరెడ్డి వనపర్తి నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన సంఘ సంస్కర్తగానే కాకుండా తెలుగు పత్రికారంగ వికాసానికి ఎనలేని కృషి చేశారు.

రావి నారాయణరెడ్డి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి పీడీఎఫ్‌ టికెట్‌పై నల్లగొండ లోక్‌సభ స్థానంతోపాటు భువనగిరి నుంచి అసెంబ్లీకి గెలుపొందారు.

బొమ్మగాని ధర్మభిక్షం
తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన ధర్మభిక్షం పీడీఎఫ్‌ టికెట్‌పై సూర్యాపేట నుంచి విజయం సాధించారు.

ఆరుట్ల దంపతులు..
కమ్యూనిస్టు ఉద్యమంలో అంకిత భావంతో పనిచేసిన ఆరుట్ల రామచంద్రా రెడ్డి, ఆరుట్ల కమలాదేవి దంపతులిద్దరూ ఈ శాసనసభకు సభ్యులుగా ఎన్నికై.. అరుదైన రికార్డును నెలకొల్పారు. కమలాదేవి పీడీఎఫ్‌ టికెట్‌పై ఆలేరు నుంచి గెలుపొందారు. ఆమె భర్త రామచంద్రారెడ్డి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మెదక్‌ జిల్లా రామాయంపేట నుంచి పీడీఎఫ్‌ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

రాఘవరావు
పీడీఎఫ్‌ నేత పెండ్యాల రాఘవరావు మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ సీటు (మొత్తం 4 సీట్లు)కు పోటీ చేశారు. కేవలం ఒక అసెంబ్లీ స్థానంలో (వరంగల్‌) మినహా, వరంగల్‌ లోక్‌సభ, హనుమకొండ, వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గాల నుంచి ఆయన గెలుపొందారు. లోక్‌సభ సభ్యుడిగానే కొనసాగారు.

డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి
కాంగ్రెస్‌ టికెట్‌పై వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి డా.మర్రి చెన్నారెడ్డి గెలిచారు. ఆ తర్వాత కూడా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను చాటారు. తెలంగాణ ప్రజా సమితి ద్వారా కాంగ్రెస్‌పైనే తిరుగుబాటు చేశారు.

కేవీ రంగారెడ్డి..
మర్రి చెన్నారెడ్డి మేనమామ కొండా వెంకట రంగారెడ్డి షాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 

వీబీ రాజు..
వల్లూరి బసవరాజు సికింద్రాబాద్‌ ద్విసభ్య స్థానం నుంచి జనరల్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ టికెట్‌పై ఎన్నికయ్యారు. తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూమంత్రిగా, కాంగ్రెస్‌ రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ..
తొలిసారి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫా బాద్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంత్రిగానూ పనిచేసిన బాపూజీ.. తెలంగాణ తొలి, మలి విడత ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. 
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement