అదిరేలా సంబురాలు
దశాబ్దాల స్వప్నం సాకారమవుతున్న వేళ సంబరాలు అంబరాన్నంటనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా.. ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు, టీజేఏసీ, ఉద్యోగ సంఘాల నాయకులు సన్నాహాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి నుంచే వేడుకల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. ఊరూరా.. వాడవాడనా నూతన రాష్ట్ర అవతరణ వేడుకల కోసం అన్నివర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉరుమే ఉత్సాహం.. కొత్త పునరుత్తేజంతో స్వరాష్ట్రానికి స్వాగతం పలకనున్నారు.
తాండూరు, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై తాండూరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు దృష్టి సారించారు. కోట్లాదిమంది తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల సోమవారం సాకారం కానుంది. ఈ క్రమంలో వేడుకల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ప్రభుత్వ శాఖలన్నీ తమ కార్యాయాలను అందంగా ముస్తాబు చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా కార్యాలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు ప్రతి శాఖ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారితో పాటు విద్యార్థి నాయకులు, కళాకారులు, ఉద్యోగులు, కార్మికులు, జర్నలిస్టులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ఆటపాటలతో ధూంధాం కార్యక్రమాలు నిర్వహించాలని ఆయా శాఖల ఉద్యోగులు నిర్ణయించారు. తెలంగాణ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు, ఆటల పోటీలు తదితర కార్యక్రమాలతో వారం రోజులపాటు సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ఉద్యోగులు సన్నాహాలు చేస్తున్నారు.అన్ని శాఖలు కలిసి ఒకసారి సంబురాలు నిర్వహించాలని, ఇందులో ఆయా శాఖల అధికారులందరినీ భాగస్వామ్యం చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. సంబురాలకు తెలంగాణ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో పాటు కళాకారులను ఆహ్వానించాలని ఉద్యోగులు యోచిస్తున్నారు.
నేటి అర్ధరాత్రి నుంచే తెలంగాణ ఆవిర్భావ సంబరాలు
దోమ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి 12గంటలకు పరిగిలోని అమరవీరుల చౌరస్తాలో తెలంగాణ సంబరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హరిశ్చంద్ర, విద్యావంతుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాత్రి 12గంటల నుంచి తెల్లవారుజాము వరకు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. సంబరాలకు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, తెలంగాణ జేఏసీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
తాండూరు రూరల్: ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు నయీం (అప్పు) శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు హాజరు కావాలని కోరారు.
మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో ...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు బాలాజీ మందిర్‌లో ‘రక్తదాన శిబిరం’ నిర్వహిస్తున్నట్లు తాండూరు శాఖ అధ్యక్షుడు మహేష్‌కుమార్ సార్థా, కార్యదర్శి కుంజ్ బిహారిసింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణవాదులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వారు కోరారు.