
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సంచలనానికి తెరతీయగా... అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, ఉనికిని కాపాడుకోవాలనే తాపత్రయంతో టీడీపీ పొత్తుకు సిద్ధమయ్యాయి. అయితే కేవలం టీడీపీతో పొత్తు ద్వారా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేమని భావించిన కాంగ్రెస్ పెద్దలు.. బీజేపీ మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే టీడీపీ, సీపీఐ పార్టీలతో చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే..
సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీకి15 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం, సీపీఐకి 4 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంలో భాగంగా కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి(టీజేఎస్), సీపీఎం పార్టీ నాయకులతో చర్చలు కొనసాగిస్తున్నారు. టీజేఎస్‌కు 6, సీపీఐకి 4, సీపీఎంకు 4 అసెంబ్లీ సీట్లివ్వాలని యోచనలో ఉన్నారు. అదే విధంగా అన్ని పార్టీలకు కలిపి మూడు లోక్‌సభ స్థానాలు కూడా కేటాయించేందుకు టీపీసీసీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మహాకూటమి ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే... ఆపద్ధర్మ ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై గతంలో నమోదైన కేసులను తిరగదోడుతుందనే ప్రచారం జోరందుకుంది.
జగ్గారెడ్డిపై అక్రమ రవాణా కేసు..
మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2004లో బోగస్ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా.. మరో గుజరాతీ యువతిని కుమార్తెగా.. ఓ యువకుడిని కుమారుడిగా పేర్కొంటూ పాస్‌పోర్టులు, అమెరికా వీసాలు సంపాదించి అక్కడ వదిలి వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని ఇటీవలే గుర్తించామని, దీనిపై పాస్‌పోర్టు అధికారుల ఫిర్యాదుతో నార్త్‌జోన్‌లోని మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతోనే జగ్గారెడ్డిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొనడంతో.. న్యాయస్థానం ఆయనను పద్నాలుగు రోజులపాటు రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది.
గండ్ర సోదరులపై ఆయుధ చట్టం కేసు..
జగ్గారెడ్డి కేసు విచారణ కొనసాగుతుండగానే.. మరో కాంగ్రెస్ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డిలపై మంగళ వారం రాత్రి ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. కాగా కొన్ని రోజుల కిందట క్రషర్ల లావాదేవీల విషయంలో గండ్ర భూపాల్ రెడ్డి ఆయన వ్యాపార భాగస్వామి ఎర్రబెల్లి రవీందర్ రావుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తనపై తుపాకీతో దాడి చేశారంటూ రవీందర్ రావు, భూపాల్‌రెడ్డిలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవీందర్ రావు అనుచరులు, గండ్ర సోదరులు సహా వారి అనుచరులపై కూడా కేసు నమోదైంది. కాగా తమ పార్టీ నేతలను అప్రతిష్ఠపాలు చేయాలనే ఉద్దేశంతోనే పాత కేసులను తిరగదోడుతూ, కొత్త కేసులు బనాయిస్తూ ఆపద్ధర్మ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని స్థానిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
నెక్ట్స్ టార్గెట్ రేవంత్ రెడ్డేనా..?
కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి అరెస్టు.. గండ్ర సోదరులపై కేసు నమోదు నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వ నెక్ట్స్ టార్గెట్ రేవంత్ రెడ్డే అయి ఉండవచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది. అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తాజాగా కాంగ్రెస్, టీడీపీలు పొత్తుకు సిద్ధపడుతుండటంతో రెండింటిని టార్గెట్ చేస్తూ.. ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
చట్టం తనపని తాను చేసుకుపోతోంది..
కాంగ్రెస్ నేతల అరెస్టు వెనుక ఆపద్ధర్మ ప్రభుత్వం ‘హస్తం’ ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో... ఇవన్నీ అవాస్తవాలని, చట్టం తనపని తాను చేసుకుపోతోంటే దానికి రాజకీయ రంగు పులమడమేంటని టీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment