
పెద్దపల్లి: ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో కారు టాప్‌గేర్‌లో దూసుకపోయింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. 13 జెడ్పీటీసీ స్థానాల్లో 11 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయగా.. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది. 13 మండలాల్లో 12 చోట్ల సులభంగా ఎంపీపీలు ఎన్నికయ్యేలా టీఆర్‌ఎస్ ఎంపీటీసీలు విజయం సాధించారు. పెద్దపల్లి మండలంలో మాత్రం టీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం తక్కువ గెలుచుకుంది. 17 ఎంపీటీసీ స్థానాల్లో తొమ్మిది స్థానాలు గెలిచిన వారు ఎంపీపీగా గెలవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది, టీఆర్‌ఎస్‌కు ఏడు, బీజేపీ నుంచి ఒకరు, ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి మరొకరు గెలుపొందారు. దీంతో ఆ ఇద్దరి మద్దతుతో పెద్దపల్లి ఎంపీపీ పదవి కూడా టీఆర్‌ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో 13వ ఎంపీపీ పదవులు టీఆర్‌ఎస్ ఖాతాలోనే జమకానున్నాయి.
89 ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌వే..
జిల్లాలోని 138 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో టీఆర్‌ఎస్ పార్టీ 89, కాంగ్రెస్ పార్టీ 34, బీజేపీ 5, ఫార్వర్డ్‌బ్లాక్, ఇండిపెండెంట్లు 10 మంది విజయం సాధించారు. ఎలిగేడు మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాలకు మొత్తం స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకోవడం విశేషం. ఇక అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడంతో అధికార పార్టీకి ప్రాదేశిక ఎన్నికలు ఊపునిచ్చాయి.
కాంగ్రెస్ ఖాతాలో రెండే జెడ్పీటీసీలు..
రామగుండం నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీ స్థానాలు, మంథని నియోజకవర్గంలో నాలుగు స్థానాలు జెడ్పీటీసీ పదవులు టీఆర్‌ఎస్ గెలుచుకుంది. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు జెడ్పీపీటీసీ స్థానాల్లో నాలుగింటిని టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకోగా సుల్తానాబాద్‌లో మినుపాల స్వరూప(కాంగ్రెస్‌పార్టీ), ఓదెలలో గంట రాములు(కాంగ్రెస్‌పార్టీ) విజయం సాధించారు. మంథనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రాతిని«థ్యం వహిస్తుండగా, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి పనిచేస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నప్పటికీ మంథనిలో కాంగ్రెస్‌పార్టీకి ఒక్క జెడ్పీ స్థానం కూడా దక్కలేదు. పెద్దపల్లిలో రెండుస్థానాలను టీఆర్‌ఎస్‌పార్టీ కోల్పోయింది. రామగుండంలో మాత్రం రెండింటికి రెండు టీఆర్‌ఎస్ ఖాతాలో చేరాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ బావ ఆముల నారాయణ అంతర్గాం జెడ్పీటీసీగా పోటీ చేశారు. పోస్టాఫీస్ ఉద్యోగానికి రాజీనామ చేసి ఎన్నికల బరిలో ఉన్న నారాయణను ఓటర్లు గెలిపించారు.
ఎదురులేని పుట్టమధు..
పెద్దపల్లి తొలి జెడ్పీ చైర్మన్‌గా పుట్టమధు ఎన్నిక ఇక లాంఛనప్రాయమే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పుట్టమధును జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో పార్టీలో రెండో పేరు పరిశీలన లేకుండాపోయింది. ప్రాదేశిక ఎన్నికలు ఆరంభం నుంచి పుట్టమధు తన గెలుపుతోపాటు ఇతర మండలాల్లోని జెడ్పీటీసీ సభ్యుల గెలుపు కోసం పార్టీ వ్యూహరచన చేసింది. 13 జెడ్పీటీసీ స్థానాల్లో ఏడు గెలుచుకోవడం ద్వారా జెడ్పీ చైర్మన్ కైవసం చేసుకోవాలని ఎన్నిక బరిలో దిగారు. ఫలితాల్లో పార్టీ ఊహించినదానికంటే ఎక్కువ స్థానాలు రావడంతో ఇక పుట్టమధుకు ఎదురులేకుండా పోయింది. ఈనెల 8న జరిగే జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పుట్టమధు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి, పెద్దపల్లికి తొలి జడ్పీ చైర్మన్‌గా పుట్టమధుకు అవకాశం దక్కనుంది.
ముగ్గురికి భారీ మెజార్టీ.. ఇద్దరికీ అత్యల్పం
జెడ్పీటీసీ ఎన్నికల్లో ముగ్గురు భారీ మెజార్టీతో విజయం సాధించగా, ఇద్దరు చివరిక్షణం వరకు టెన్షన్‌కు గురయ్యారు. 13 స్థానాల్లో 8 చోట్ల అభ్యర్థుల జాతకాలు ఐదారో రౌండ్ వరకు తేలిపోయాయి. ముగ్గురైతే కమాన్‌పూర్‌లో పుట్టమధు, ధర్మారంలో పద్మజ, జూలపల్లిలో బొద్దుల లక్ష్మీనర్సయ్య మొదటి రెండు, మూడు రౌండ్లలోనే తమ జాతకం ఖరారైంది. విజేతలుగా దాదాపు తేలిపోయారు. అయితే ఓదెలలో గంట రాములు 153 ఓట్ల మెజార్టీ, రామగిరిలో మాదరవేని శారద 268 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇద్దరూ రీకౌంటింగ్‌కోసం దరఖాస్తు చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్న సమయంలోనే విజేతలుగా అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment