సాక్షి, హైదరాబాద్: మూడేళ్లకు పైగా నాన్చి కంటితుడుపు చర్యగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి గిరిజన సలహా మండలి నియామకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేశారని, గిరిజనులను దారుణంగా మోసగించారని వైఎస్సార్‌సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గిరిజన సలహా మండలిని 2014లోనే ఏర్పాటు చేయాల్సి ఉన్నా చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా నియమించ లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం మండలిలో 20 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సీఎం తన కుట్రలను, కుతంత్రాలను అమలు చేసుకునేందుకు తొత్తులను నియమించుకున్నారని దుయ్యబట్టారు.
కోర్టు జోక్యంతో ఏర్పాటు చేసిన ఈ మండలిలో ఎమ్మెల్యేలు కాని 8 మందిని నియమించడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీఓ నెంబర్ 87 ప్రకారం అప్పట్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంకు కూడా గిరిజన సలహా మండలిలో చోటు కల్పించారని తెలిపారు. కానీ చంద్రబాబు ఏకపక్షంగా ఏర్పాటు చేశారన్నారు. గిరిజన సలహా మండలి నియామకంపై కోర్టుకు వెళతారా? అని ప్రశ్నించగా పార్టీ అధ్యక్షుడుతో చర్చించాక ఒక నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు. 50 ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛన్లు ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ఏమైందని బాలరాజు ప్రశ్నించారు.
చంద్రబాబు తొత్తులకు స్థానమా?
Published Tue, Sep 26 2017 2:18 PM | Last Updated on Tue, May 29 2018 2:44 PM
Advertisement