టి.నరసాపురం: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను విభజించి పాలిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. టి.నరసాపురం మండలం రాజుపోతేపల్లి గ్రామంలో వైఎస్సార్ విగ్రహం వద్ద సోమవారం రాత్రి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాడ్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి వాటి సిఫార్సుతో పచ్చచొక్కా వారికే ప్రభుత్వ పథకాలను కట్టబెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ ప్రభుత్వంలో పింఛన్ తీసుకునే వందలాది మంది పింఛన్‌దారులను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ హయాంలో ఉచితంగా ఇసుక లభించేదని, ఇప్పుడు ఇసుక బంగారమైందని, నిరుపేదలు ఇళ్ళు కట్టుకోవడం ఆర్థికభారమై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో భూములను సస్యశ్యామలం చేయడానికి బోర్లు మంజూరు చేశారని, ఇందిరమ్మ పథకంలో ఇళ్లస్థలాలు, ఇళ్ళు ఇచ్చారని గుర్తుచేశారు.
ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ అరాచకాలను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపేదలకు భరోసాగా నిలబడేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సూచనలు మేరకు రాష్ట్రమంతటా గ్రామాల్లో నాయకులు రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీను రాజు, నాయకులు దేవరపల్లి ముత్తయ్య, నల్లూరి వెంకటేశ్వరరావు, పిన్నమనేని చక్రవర్తి, కాల్నీడి సుబ్బారావు, మక్కినశ్రీను, బొంతు అంజిబాబు, బేతిన సత్యనారాయణ, బొల్లిన నాగభూషణం, పొగరెడ్డి ప్రవీణ్, దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment