
సాక్షి, అమరావతి: జనసేనతో టీడీపీ పొత్తు ఉంటుందని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్, మాయావతి ప్రపంచంలో ఎవరూ లేనంతగా కొట్లాడుకున్నారని.. వారే కలిసినప్పుడు టీడీపీ, జనసేన కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఉండవల్లిలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చిలో రెండు పార్టీల మధ్య ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంపై చర్చలు జరుగుతాయని, తెలిపారు. పొత్తు తప్పకుండా ఉంటుందని తేల్చి చెప్పారు. తనకు ముఖ్యమంత్రి కుర్చీపై ఆశ లేదని పవన్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. రెండు పార్టీల నాయకుల మధ్య అపోహలు తొలగిపోయాయని చెప్పారు.
తన కుమారుడికి కర్నూలు సీటు వస్తుందని, సర్వేల్లో ప్రజాదరణను బట్టి చంద్రబాబు సీటిచ్చే అవకాశం ఉందన్నారు. పొత్తుపై టీజీ వ్యాఖ్యలు చేసిన తర్వాత పవన్‌కల్యాణ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆయన మళ్లీ ఉండవల్లిలో మీడియాతో మాట్లాడుతూ పవన్ ఆవేశం తగ్గించుకోవాలని, అప్పుడు మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. పొత్తు ఖరారైతే మార్చిలో చర్చలు ఉంటాయని మాత్రమే చెప్పానన్నారు. కాగా పొత్తు గురించి మాట్లాడడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు టీజీ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసినట్లు మీడియాకు లీకులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment