జగ్గారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రాజీనామా నిర్ణయం వెనక వ్యూహం ఉందని కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి నర్మగర్భంగా వ్యాక్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో జగ్గారెడ్డి చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలన్నది రాహుల్ గాంధీ ఉద్దేశమని అన్నారు. ఎలా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందనేది ఆయన ఆలోచన అని తెలిపారు. రాజీనామా చేయటమంటే వెనక్కి తగ్గటం కాదన్నారు. సీనియర్లకు గౌరవం ఇస్తూనే..పార్టీని ప్రక్షాళన చేయాలన్న నిర్ణయంలో భాగమే రాజీనామా అని చెప్పారు. గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యం కాదన్నారు.
పది సంవత్సరాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా వద్దనుకున్నారని అన్నారు. యూపీఏ హయాంలో సోనియా, రాహుల్ గాంధీలు పేదలకు పని కల్పించారని గుర్తు చేశారు. నెహ్రూ ప్రధాని అయినపుడు ఇందిర పదవి తీసుకోలేదు..ఇందిరా గాంధీ హయాంలో రాజీవ్ ప్రధాని పదవి తీసుకోలేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్లతో పాటు యువత కూడా అవసరమేనన్నారు. పార్టీ ప్రక్షాళనను రాహుల్ ప్రారంభించారని, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఏలో యాక్టివ్‌గా పనిచేసే వారిని రాష్ట్ర కాంగ్రెస్ ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment