విలేకరులతో మాట్లాడుతున్న బీజేపీ అధికార ప్రతినిథి కృష్ణ సాగర్ రావు
సాక్షి, హైదరాబాద్ : ఆకాశానికి హద్దు లేదు.. టీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడే మాటలకు పద్దులేదు అన్న చందంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిథి కృష్ణసాగర్ రావు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంపై బట్ట కాల్చి మీద వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో మంత్రులు ఎవరో కూడా తెలియకుండా కేసీఆర్ కుటుంబం ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. ప్రతిదీ కేంద్రానిదే భాద్యత అని అంటున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో రైతులకు ఏం ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మొదట మీరేంచేశారో చెప్పిన తరువాత కేంద్రం గురించి మంత్రి హరీష్ మాట్లాడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కేంద్రం రైతులకు వెన్నుదన్నుగా నిలిచే విధంగా బడ్జెట్ రూపొందించిందని వ్యాఖ్యానించారు. కేంద్రం చూపిన విధంగా రైతులకు నేరుగా మార్కెట్లో అమ్ముకునే విధంగా మంత్రి హరీష్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి భిన్న వాదనలు ఉన్నాయన్నారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాతబస్తీ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎక్కడ బడితే అక్కడ కేసీఆర్ గొప్పోడిగా చెప్పుకునే అసదుద్దీన్ ఎందుకు అభివృద్ధి కావడం లేదని అడిగారు. భారత్ సైనికులకు మతం ఉండదనే విషయం అసదుద్దీన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అసద్ విభజన రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి మాటలను మరోసారి చేయొద్దని బీజేపీ హెచ్చరిస్తోందని తెలిపారు. ఎంఐఎం హఠావో.. హైదరాబాద్ బచావో అనే నినాదంతో బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అసదుద్దీన్ ఓటమి చవిచూసే విధంగా పార్టీ కొత్త నేతలను ప్రోత్సహిస్తుందని వివరించారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో మాట్లాడినందుకు సల్మాన్ నాజరీని అల్ ఇండియా ముస్లిం లా బోర్డు నుంచి అసదుద్దీన్ తొలగించారని చెప్పారు. ప్రమాదకరమైన రాజకీయాలకు అసదుద్దీన్ తెరలేపుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment