
తమిళనాడులోని తిరువారుర్ అసెంబ్లీ స్థానానికి జనవరి 28న ఉప ఎన్నికలు జరగనున్నాయి.
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరువారుర్ అసెంబ్లీ స్థానానికి జనవరి 28న ఉప ఎన్నికలు జరగనున్నాయి. 31న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటన చేసింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మరణించడంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. తిరువారుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కరుణానిధి ఆగస్టు 7న కన్నుమూశారు.
ఉప ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 3న విడుదల చేస్తామని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రతా సాహు తెలిపారు. అప్పటి నుంచి తిరువారుర్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. నామినేషన్ల దాఖలు చేయడానికి చివరి తేది జనవరి 10. తర్వాతి రోజు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 14. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను వినియోగించనున్నట్టు ఈసీ తెలిపింది.