లోక్‌సభలో మాట్లాడుతున్న టీఎంసీ నేత సౌగత రాయ్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో సీబీఐ, పోలీసు శాఖల మధ్య తలెత్తిన వివాదం ప్రభావం సోమవారం పార్లమెంట్ కార్యకలాపాలపై పడింది. మోదీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందంటూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చేపట్టిన ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. అయితే, ఆ రాష్ట్రంలోని అసాధారణ పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన చర్య తీసుకునే కేంద్రానికి అధికారం ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
ప్రతిపక్షం మూకుమ్మడి దాడి
రాజకీయ విరోధులకు వ్యతిరేకంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని లోక్‌సభలో టీఎంసీ సహా ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేయగా..ఇప్పటికే ఈ అంశం కోర్టులో ఉందంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ డిమాండ్‌ను తిరస్కరించారు. అనంతరం టీఎంసీ నేత సౌగత రాయ్ మాట్లాడుతూ.. ‘పశ్చిమబెంగాల్‌లో రాజకీయంగా పాగా వేసేందుకు కేంద్రం సీబీఐని వాడుకుంటోంది. ఇలాంటి ప్రయత్నాలను మేం తీవ్రంగా ప్రతిఘటిస్తాం’ అని అన్నారు.
‘ప్రతిపక్షాల అణచి వేతకు, నియంతృత్వ పాలన సాగించేందుకు సీబీఐను కేంద్రం అడ్డుపెట్టు కుంటోందని, ఈ చర్యలకు భయపడబోం’ అని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. మమతా ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా తప్పు చేస్తోందనీ, కుంభకోణాలపై సీబీఐ నాలుగేళ్లుగా ఎందుకు దర్యాప్తు చేయలేదని సీపీఎం నేత బదరుద్దోజా ఖాన్ ప్రశ్నించారు. అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతుండగా టీఎంసీ సభ్యులు చప్పుట్లు, నినాదాలతో అంతరాయం కలిగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డుతగలడంతో చైర్మన్ వెంకయ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు.
సమాఖ్య వ్యవస్థకు విఘాతం
పశ్చిమబెంగాల్‌లో నెలకొన్న అనూహ్య పరిణామాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ విషయమై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ‘పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఘటన దేశ చరిత్రలోనే అసాధారణమయింది. అక్కడ రాజ్యాంగబద్ధ పాలన సాగడం లేదు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా తలెత్తిన అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దే అధికారం కేంద్రానికి ఉందని రాజ్యాంగం చెబుతోంది’ అని ఆయన అన్నారు. ‘చట్ట ప్రకారం తమ విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన సీబీఐ అధికారులను అడ్డుకోవటం దురదృష్టకరం.
ఇలాంటి చర్యలు అరాచకానికి దారితీస్తాయి’ అని అన్నారు. రాజీవ్‌కుమార్ అధికారులకు సహకరించడం లేదన్నారు. తూర్పు భారతంలోని లక్షలాది మంది పేదలను మోసం చేసిన శారదా చిట్‌ఫండ్ స్కాంకు సంబంధించిన బాధితులు ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్ ప్రజలే. దీనిపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణంలో మనీల్యాండరింగ్, నల్లధనం, రాజకీయ నేతల ప్రమేయం వంటి అంశాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తంపైనా సీబీఐ దర్యాప్తు చేస్తోంది’ అని రాజ్‌నాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment