సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సంపూర్ణ సాకారం.. అభివృద్ధి కొనసాగింపు ప్రధాన అంశాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో రూపొందనుంది. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్న టీఆర్‌ఎస్.. తమ మేనిఫెస్టో రూపకల్పనలోనూ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించనుంది. నాలుగేళ్ల మూడు నెలల పాలనను వివరిస్తూనే, మళ్లీ అధికారంలోకి వస్తే ఏ వర్గాలకు ఏం చేయనున్నామో వివరించేలా మేనిఫెస్టో సిద్ధమవుతోంది.
కొత్తవి తక్కువే
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించడమే మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా ఉండనుంది. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి పథకాలపై వివరించే అవకాశం ఉంది. ఆసరా పింఛన్ల మొత్తం పెంపు, నిరుద్యోగ భృతి అంశాలను కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. నిరుద్యోగ భృతి చెల్లించే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చే విషయంపై పరిశీలిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. మేనిఫెస్టో రూపకల్పన కోసం టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నేతృత్వంలో 15 మంది పార్టీ నేతలతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తొలి భేటీ శనివారం జరగనుంది. ఒకే భేటీలో ముసాయిదా మేనిఫెస్టోను పూర్తి చేసి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అందించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment