లాక్‌డౌన్‌ కొనసాగించాలి | PM Narendra Modi Video Conference With TR Leaders KK and Nama | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ కొనసాగించాలి

Published Thu, Apr 9 2020 3:10 AM | Last Updated on Thu, Apr 9 2020 3:11 AM

PM Narendra Modi Video Conference With TR Leaders KK and Nama - Sakshi

బుధవారం ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కేకే, నామా 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ మినహా మరో మార్గం లేదని టీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టం చేసింది. పరిస్థితి కుదుట పడేంత వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కేంద్రానికి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పార్లమెంటరీ పార్టీ నాయకులతో  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పక్షాన ప్రగతి భవన్‌ నుంచి పార్టీ పార్లమెంటరీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ వైఖరిని కె.కేశవరావు ప్రధాని మోదీకి తెలియజేశారు. ‘కేంద్ర, రాష్ట్రాలు కలసికట్టుగా పనిచేస్తూ కరోనా కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయి. సీఎం కేసీఆర్‌ దీని కోసం నిర్విరామంగా కష్టపడుతున్నారు. లాక్‌డౌన్‌ చేయాలా వద్దా అనే అంశంపై అందరిలోనూ ఏదో ఒక ఆలోచన ఉంది. లాక్‌డౌన్‌ వల్ల కష్టనష్టాలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే ఉత్తమ మార్గం. వైద్య సదుపాయాల్లేని గ్రామీణ ప్రాంతాలకు ఇది విస్తరిస్తే పరిస్థితి చేయిదాటే అవకాశముంది. మన ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నా మానవ మనుగడను పణంగా పెట్టి ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వొద్దు’అని కేకే స్పష్టం చేశారు.  

సంక్షోభాన్ని అధిగమించే శక్తి ఉంది 
‘రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ద్వారా తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు కష్టపడుతున్నాం. వలస కూలీలతో సహా అందరి బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశంలో 60 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు, 440 బిలియన్‌ డాలర్ల విదేశీ ద్రవ్య నిల్వలున్నాయి. అయితే వీటిని అవసరమైన వారికి అందజేయడంలో మనం వెనుకబడుతున్నాం. సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి ఉందని గతంలో అనేకమార్లు రుజువైంది. అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో సపోర్ట్‌ ప్యాకేజీ 10 శాతముంటే, మనకు కేవలం 1 శాతమే ఉంది. దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వడ్డీరేట్లను కూడా తగ్గించాలి. రిజర్వు బ్యాంకు మంచి నిర్ణయాలే తీసుకుంది. మార్కెట్లో డబ్బు ఎక్కువ అందుబాటులో ఉండేట్లు చూడాలి. మనం ద్రవ్య లోటు, ఎఫ్‌ఆర్‌ బీఎం లాంటి ఆర్థిక లక్ష్యాల గురించి చింతించాల్సిన పని లేదు. రాష్ట్రాలకు కావాల్సిన నిధులు అందించాలి. పాత బకాయిలు కూడా చెల్లించాలి..’అని కేకే రాష్ట్రం తరఫున కేంద్రాన్ని కోరారు. 

మా మద్దతు ఉంటుంది
‘కరోనా వ్యాప్తి నివారణకు, మీరు తీసుకున్న నిర్ణయాలకు మా మద్దతు ఉంటుంది.  ప్రధాని కార్యాలయం ద్వారా నిర్ణయాలు తీసుకోకుండా వికేంద్రీకరణతో మంచి ఫలితాలుంటాయి. వేతనాల్లో కోత, ఎంపీ ల్యాడ్స్‌ విషయంలో కేంద్రం నిర్ణయా న్ని మేము ఇప్పటికే అంగీకరించాం. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక నిర్వహణ విధానాలు ఏకీకృత నిధుల వినియోగానికి ప్రతిబంధకం ఉన్న ఇబ్బందులను తొలగించాలి. సీఎంలు వారి బాధ్యతలు నిర్వర్తించే స్వేచ్ఛను ఇవ్వాలి. రాష్ట్రంలో రాబడి పడిపోయి, రోజుకు రూ.400 కోట్లకు బదులు గా అతి కష్టంగా రూ.కోటి మాత్రమే సమకూరుతోంది. రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇ వ్వాలి’అని టీఆర్‌ఎస్‌ పక్షాన కేకే కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రబీ పంట కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం మంత్రి వర్గ సంఘాన్ని ఏర్పాటు చేసిందని, రైతులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రధానికి కేకే వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement