తిరుగులేని టీఆర్‌ఎస్‌  | TRS Full Majority In ZPTC And MPTC Elections | Sakshi
Sakshi News home page

తిరుగులేని టీఆర్‌ఎస్‌ 

Published Thu, Jun 6 2019 8:02 AM | Last Updated on Thu, Jun 6 2019 8:02 AM

TRS Full Majority In ZPTC And MPTC Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచి టీఆర్‌ఎస్‌ను నెత్తికెత్తుకున్న ఉమ్మడి జిల్లా మరోసారి ఆ పార్టీకి అండగా నిలిచింది. ఇతర పార్టీలేవీ దరికి చేరనంతగా గులాబీ దళం ఓట్ల సునామీ సృష్టించింది. ఉమ్మడి కరీంనగర్‌ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఎక్కడా ప్రతిపక్షం ఆనవాళ్లు కూడా కనిపించని రీతిలో ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడడం ఆ పార్టీ నేతలను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఓడిపోతుందనుకొన్న మండలాల్లో సైతం టీఆర్‌ఎస్‌ విజయబావుటా ఎగరవేయడం పట్ల ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆనందానికి అవధులు లేవు. కరీంనగర్‌ జిల్లాలో ఏకంగా 15 జెడ్‌పీటీసీలతో క్లీన్‌స్వీప్‌ చేసిన టీఆర్‌ఎస్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేవలం ఒక్కో జెడ్పీటీసీని కాంగ్రెస్‌కు కోల్పోయింది. పెద్దపల్లి జిల్లాలో రెండు జెడ్పీటీసీలు కాంగ్రెస్‌ వశమయ్యాయి. ఫలితాలకు ముందు హోరాహోరీ  పోరు జరిగిందని భావించిన పలు మండలాలు కూడా ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ వశమవడం గమనార్హం.

అసెంబ్లీ ఫలితాల కన్నా పెరిగిన బలం
అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రాతినిధ్యం వహించిన మంథని నియోజకవర్గం కాంగ్రెస్‌ వశమైంది. రామగుండంలో టీఆర్‌ఎస్‌ మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కేవలం 500 లోపు ఓట్లతోనే విజయం సాధించారు. కానీ ప్రాదేశిక ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. మంథనిలోని నాలుగు మండలాల్లో టీఆర్‌ఎస్‌ విజయబావుటా ఎగరవేయగా, రామగుండం, ధర్మపురిలోని అన్ని జెడ్పీటీసీలు గులాబీ ఖాతాలోకే చేరాయి. కేవలం పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలోనే రెండు జెడ్‌పీటీసీలు కాంగ్రెస్‌ చేతికి చిక్కాయి. ఈ మండలాలు కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి సీహెచ్‌.విజయరమణారావు పుట్టి పెరిగిన ప్రాంతాలు కావడం, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పట్ల కొంత వ్యతిరేకత వంటి పరిణామాలతో కాంగ్రెస్‌ వశమయ్యాయి.

పెద్దపల్లి జిల్లాలో మరో మూడు మండలాలు కూడా కాంగ్రెస్‌ వశమవుతాయని ఆ పార్టీ నేతలు భావించినప్పటికీ, టీఆర్‌ఎస్‌ గణనీయంగా ఓట్లు రాబట్టుకుంది. కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్‌ మినహా అన్ని సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ హవా సునామీని తలపించింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో జెడ్పీటీసీలతోపాటు ఎంపీటీసీలు కూడా గులాబీ పార్టీ కైవసం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించింది. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, వేములవాడ నియోజకవర్గాల్లో కలిపి టీఆర్‌ఎస్‌పై బీజేపీ దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీ సాధించగా, ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఊహించనన్ని ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పత్తా లేకుండా పోయారు. మంత్రి ఈటల ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్‌తోపాటు చొప్పదండి, మానకొండూరు, కరీంనగర్‌ , సిరిసిల్ల, కోరుట్ల, ధర్మపురి స్థానాల్లో ఒక్క సీటు కూడా ప్రతిపక్షానికి దక్కకపోవడం గమనార్హం.

సంక్షేమ ఫలాలు మరవని పల్లె జనం
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపాయనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం. పార్లమెంటు ఎన్నికల్లో యువత, విద్యార్థులు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో ‘కేసీఆర్‌కు సంబంధం లేని ఎన్నికలు’ అని చెప్పించి ఓట్లు వేయించిన కారణంగానే కరీంనగర్, నిజామాబాద్‌ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి మెజారిటీ వచ్చిందనే విషయం ఈ ఫలితాలతో తేటతెల్లమైంది. సంక్షేమ పథకాల లబ్ధి కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ నాయకులు ఉంటేనే సాధ్యమవుతుందని భావించి, ప్రాదేశిక ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించారని స్పష్టమవుతోంది. కాగా ప్రాదేశిక ఎన్నికలకు నగర, పట్టణ ప్రాంతపు ఓటర్లు దూరంగా ఉండడం కూడా టీఆర్‌ఎస్‌ మెజారిటీ పెరిగేందుకు కారణమైందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

మంత్రులు, ఎమ్మెల్యేలు హ్యాపీ
టీఆర్‌ఎస్‌కు అందిన ఈ విజయం పట్ల ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలు సైతం ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. పల్లె జనం తమ వెంటే ఉన్నారని, ఫలితాలు వెయ్యేనుగుల బలాన్నిచ్చాయని కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తరువాత కొంత ఇబ్బంది పడ్డ ఎమ్మెల్యేలు మంగళవారం ఫలితాలు వెలువడ్డ తరువాత సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కార్యకర్తలతో కలిసి ఉత్సవాలు జరుపుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement