సస్యశ్యామలం చేస్త | TRS Government Will Irrigate Whole Telangana Says KCR | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 5 2018 2:15 AM | Last Updated on Wed, Dec 5 2018 11:50 AM

TRS Government Will Irrigate Whole Telangana Says KCR - Sakshi

కోస్గి సభలో మాట్లాడుతున్న కేసీఆర్‌. చిత్రంలో హరీశ్‌రావు, పట్నం నరేందర్‌రెడ్డి

పాలమూరు ప్రాంతానికి శత్రువులెవరో కాదు.. ఈ ప్రాంతానికి చెందిన నాయకులే. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు కేసులు వేశారు. నాగం జనార్దన్‌రెడ్డి కేసు వేస్తే హైకోర్టు నిన్ననే చెంప ఛెళ్లుమనిపించింది. పవన్‌కుమార్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా కేసులు వేసిండ్రు. ఇలా మన దరిద్రులే కేసులు వేస్తున్నరు. ప్రాజెక్టులకు అడ్డంపడ్డ బాబు ఇప్పుడు సిగ్గు లేకుండా ఓట్లు ఎలా అడుగుతడు? 

ఎన్నికలు వచ్చినప్పుడు ఎంతోమంది నాయకులు వచ్చి ఏదేదో చెప్పిపోతుంటరు.. ఆగమాగం కావద్దు.. అందరి మాటలు విని, ఎవరు మంచి చేస్తారో ఆలోచించి ఓట్లేయాలె. ఈ ఎన్నికల్లో తికమక ఏమీలేదు. 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన, నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనను బేరీజు వేసుకోవాలె. హైదరాబాద్‌ను నేనే కట్టిన.. ప్రపంచపటంలో నేనే పెట్టిన అంటున్న బాబూ.. అప్పుడు విద్యుత్‌ను ఎక్కడ దాచిపెట్టావ్‌? 

సాక్షి నెట్‌వర్క్‌ : ఏళ్ల తరబడి కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలోని ప్రతీ అంగుళానికి సాగునీరు అందినప్పుడే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న తెలంగాణలోని ప్రతిఅంగుళాన్నీ సాగునీటితో తడిపే వరకు విశ్రమించబోనని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కేసీఆర్‌ జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్, మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి(కొడంగల్‌ నియోజకవర్గం), మక్తల్, వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ల్లో మాట్లాడారు.

కేసీఆర్‌ చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం ఆర్డీఎస్‌పైనేనని తెలిపారు. రాజోలి గ్రా మం వద్ద కేసీ కెనాల్‌కు నీళ్లు ఇచ్చే సుంకేçశులను పరిశీలించగా.. కింద ఉన్న గ్రామానికి తాగడానికి నీళ్లు ఇవ్వని పరిస్థితి చూసి కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు. సుంకేశుల కట్ట మీద ఉండి కర్నూలు జిల్లా పేపర్‌ చూస్తే అందులో సీమకు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనే ఎమ్మెల్యే.. కేసీఆర్‌ ఒత్తిడికి తలొగ్గి ఆర్డీఎస్‌ తూ ములు మూసివేస్తే బాంబులు పెట్టి మళ్లీ పగలకొడతానని హెచ్చరించినట్లు ప్రచురితం కాగా, ఆర్డీఎస్‌ మీద అడుగుపెట్టు.. సుంకేశుల బ్యారేజీని వెయ్యి బాంబులు పెట్టి పేలుస్తానని నాడే సభలో హెచ్చరించానని గుర్తుచేశారు.

ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టుకు నీరు రాక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి శాశ్వ త పరిష్కారం చూపేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినట్టు చెప్పారు. ఈ పథకాన్ని కూడా చంద్రబాబు అడ్డుకోవాలని చూశారని విమర్శించారు. ఆర్డీఎస్‌ను ధ్వంసం చేసినా ఆనాటి టీడీ పీ, కాంగ్రెస్‌ నాయకులు దద్దమ్మల్లా చూస్తూ ఊరుకున్నారని దుయ్యబట్టారు. తుమ్మిళ్ల మాదిరిగానే గట్టు ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్‌ జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని పేర్కొన్నారు. ఆయా సభల్లో కేసీఆర్‌ ఇంకా ఏమన్నారంటే... 
మంగళవారం కోస్గిలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం

ఈ దరిద్రులను వదిలేయాలె... 
‘పాలమూరు ప్రాంతానికి శత్రువులెవరో కాదు.. ఈ ప్రాంతానికి చెందిన నాయకులే. కేసీఆర్‌ ఎంత మందితో కొట్లాడాలి. కరువు జిల్లా అయిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నిస్తున్నం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.35వేల కోట్లు మంజూరు చేసినం. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు మాదిరిగా ఇక్కడి వారు కూడా కేసులు వేస్తున్నరు. నాగం జనార్దన్‌రెడ్డికి హైకోర్టు నిన్ననే చెంప ఛెళ్లుమనిపించింది. దొంగ కేసులు వేసి ప్రాజెక్టులకు అడ్డుకోవాలని చూసిండు. ఆయనతో పాటు దేవరకద్రలో పోటీ చేస్తున్న పవన్‌కుమార్, కొల్లాపూర్‌లో పోటీ చేస్తున్న బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా కేసులు వేసిండ్రు. ఇలా మన దరిద్రులే కేసులు వేస్తున్నరు. ఇలాంటి దరిద్రులను వదిలేయాలె. ప్రాజెక్టులకు అడ్డంపడ్డ చంద్రబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా ఓట్లు ఎలా అడుగుతడు? 

ఆగమాగం కావొద్దు
‘ఎన్నికలు వచ్చినప్పుడు ఎంతోమంది నాయకులు వచ్చి ఏదేదో చెప్పిపోతుంటరు.. ఆగమాగం కావద్దు.. అందరి మాటలు విని, ఎవరు మంచి చేస్తారో ఆలోచించి ఓట్లేయాలె. ఈ ఎన్నికల్లో తికమక ఏమీలేదు. 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన, నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనను బేరీజు వేసుకోవాలె. హైదరాబాద్‌ను నేనే కట్టిన.. ప్రపంచపటంలో నేనే పెట్టిన అంటున్న చంద్రబాబూ.. అప్పుడు విద్యుత్‌ను ఎక్కడ దాచిపెట్టావ్‌? రాష్ట్రంలో నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను ఇస్తుండడం వల్లనే మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంలేదు. కేసీఆర్‌ బతికున్నంత వరకు ఎవ్వరు అడ్డుకున్నా 24 గంటల విద్యుత్‌ను అమలు చేసి తీరుతం. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ రంగానికి రూ.43 వేల కోట్లు వెచ్చిస్తున్నం. పింఛన్లు, రేషన్‌ బియ్యం, మహిళలకు కేసీఆర్‌ కిట్లు, పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఈ పథకాలన్నీ మీ ఊళ్లోనే మీ కళ్లముందు కనిపిస్తున్నయి. కంటివెలుగు కార్యక్రమంతో పాటు చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి ప్రతీ ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేస్తం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐకేపీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తం. అన్నీ చూసి సరైన నిర్ణయం తీసుకోవాలె. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజల ఎజెండా గెలవాలి. మంచి లాభం జరగాలి. ఎన్నికల్లో గాలిగాలిగా ఓట్లు వేయొద్దు. గాలిగాళ్లకు ఓట్లేస్తే గాలిగాలిగా గత్తర చేస్తరు. అభివృద్ధి ఉండదు. అందుకే ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలె. ఇప్పటి వరకు 117 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన. తెలంగాణలో 98 నుంచి 108 వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందడం ఖాయం’అని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. 

కేసీఆర్‌కు తుమ్మిళ్ల జలాలు.. 
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ఇటీవల తుంగభద్ర నది నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అలంపూర్‌ సభకు వచ్చిన కేసీఆర్‌కు ఆర్డీఎస్‌ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్‌ తనగల సీతారామిరెడ్డి తుమ్మిళ్ల జలాలు అందించారు. వాటిని కేసీఆర్‌ తన శిరస్సున పోసుకున్నారు. కాగా, అలంపూర్‌ సభలో కేసీఆర్‌ అసహనానికి గురయ్యారు. ఆయన ప్రసంగిస్తుండగా కొందరు నినాదాలతో హోరెత్తించడంతో పాటు తోసుకుంటూ ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు స్థానిక నేతలు వారిని నచ్చజెప్పేందుకు యత్నించినా వినలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 
కాంగ్రెస్‌ అంటే కమీషన్‌.. కాలయాపన: హరీశ్‌
కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాష్ట్రంలో పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అలంపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సంకలో పిల్లిని పెట్టుకొని ఎన్నికలకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుతో కలిసి ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌ గాంధీ అలంపూర్‌కు వచ్చి చూస్తే తెలంగాణ అభివృద్ధి కనిపిస్తుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ అంటే కమీషన్లు.. కాంగ్రెస్‌ అంటే కాలయాపన అని విమర్శించారు. కానీ టీఆర్‌ఎస్‌ మాత్రం పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చిందని వ్యాఖ్యానించారు. 10 నెలల కాలంలోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మించి రైతులకు నీరందించిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని హరీశ్‌రావు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement