శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన సభలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్ సింగ్, హాజరైన జనం
కాగజ్‌నగర్/హన్మకొండ/త్రిపురారం: ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లలో ఎవరి కోటా తగ్గించి ముస్లింలకు 12 శాతం కల్పిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్‌లో, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో, నల్లగొండ జిల్లా హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. రిజర్వేషన్ కల్పించడం చేతకాక కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు రిజర్వేషన్లు ఎక్కడి నుంచి ఇస్తారని, ఎవరి రిజర్వేషన్లకు కోత పెడతారని ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఓట్ల కోసం మతాలు, కులాల వారీగా ప్రజలను విభజిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దుర్మార్గమన్నారు. బెంగాలీలకు కుల ప్రాతిపదికపై అన్యాయం జరుగుతోందని, అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులను ఎస్సీ కేటగిరిలో చేరుస్తామన్నారు.
టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు
కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేస్తుండటంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఈ పొత్తు అనైతికమని, దీనికి టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ, రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 4,500 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రశ్నించారు. రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా కనీస మద్దతు ధరను మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు కోసం రూ. 100 కోట్లు, కాకతీయ మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం రూ.155 కోట్లు మంజూరు చేస్తే నేటి వరకూ పనులు ప్రారంభం కాకుండానే శంకుస్థాపనకు పరిమితమయ్యాయని తెలిపారు.
ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి దేశం
నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 13వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రూ.16 వేల కోట్లు కేటాయిస్తే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.1.15 లక్షల కోట్లు రాష్ట్రానికి మంజూరు చేసినా అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. దేశంలో నక్సల్స్ సమస్య తగ్గిందన్నారు. ఉగ్రవాదులను దేశపొలిమెరలోకి రాకుండా కట్టడి చేశామన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయని విని ఆశ్చర్యపోయానని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
‘వాదేహై వాదోంకా క్యా’ అనే పాట గుర్తుకొస్తుంది
ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానాలు చూస్తుంటే పాత రోజుల్లో ఉపకార్ సినిమాలోని ‘వాదేహై వాదోంకా క్యా’అనే పాట గుర్తుకొస్తుందని రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వాగ్దాన భంగం చేసిన కేసీఆర్.. మళ్లీ మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారన్నారు. 2022 నాటికి దేశంలో సొంతిళ్లు లేని వారు ఉండకూడదన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం శక్తివంత దేశంగా ఎదిగితే, రాహుల్‌గాంధీ ఆలుగడ్డల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి, రాహుల్‌కు ఉన్న విజన్‌లో తేడా ఇదేనని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ లక్షా15 వేల కోట్లు ఇచ్చిందని కేంద్రమంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment