మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, చిత్రంలో ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి
సాక్షి,మిర్యాలగూడ : అమెరికన్ డాలర్ కన్నా ప్రస్తుతం గులాబీ కండువాకే విలువెక్కువుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా గులాబీ కండువాకే విలువెక్కువుందన్నారు. అందుకే కాం గ్రెస్ కండువాలు బండకేసి కొట్టి గులాబీ కండువా కప్పుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం కాదని, డిపాజిట్లు దక్కించుతాయో లేదో చూసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ పై చంద్రబాబునాయు డు మాట్లాడిన మాటలకు ఎన్‌టీఆర్ ట్రస్టు భవన్‌కు తాళం వేసుకోవల్సి వచ్చిందన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుందని, గాంధీభవన్‌కు తాళం వేసి వాచ్‌మెన్‌కు తాళం చెవి ఇచ్చి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా వెళ్తారని చమత్కరించారు.
నల్లగొండ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాదని, అది మంచుకొండగా కరిగిపోతుందన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని చెల్లని రూపాయి అని చెప్పిన ఉత్తమ్ రాష్ట్రంలో చెల్లని రూపాయలైన రేవంత్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్, మల్లు రవికి ఎలా టికెట్లు ఇచ్చారన్నారు. బోఫోర్స్, రాఫెల్ కుంభకోణాలు తప్ప కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు మేలు చేయలేదన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్య క్తం చేశారు. రెండు పర్యాయాలు తనను గెలిపిం చినట్లుగానే టీఆర్‌ఎస్ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని గెలిపించాలని కోరారు.
సభాద్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన నిర్వహించే కేసీఆర్ బహిరంగసభతో నర్సింహారెడ్డి గెలుపుఖాయం కావాలన్నారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్, టీఆర్‌ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌బీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అద్యక్షుడు నల్లమో తు సిద్ధార్థ, మిర్యాలగూడ ఎంపీపీ నూకల సరళా హనుమంతరెడ్డి, జెడ్పీటీసీ నాగలక్ష్మి, దామరచర్ల ఎంపీపీ మంగమ్మ, నారాయణరెడ్డి, చిర్రమల్లయ్య, మోసిన్‌అలీ, చిట్టిబాబు, నాగార్జునచారి, ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, డి.కళావతి, పి.పద్మావతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment