‘ఎన్నికలను ఎదుర్కొనే సత్తా ఆ పార్టీలకు లేదు’ | Jagadish Reddy Speech At Nalgonda District | Sakshi
Sakshi News home page

కాల్వ చివరి భూములకు నీరందించాం

Published Wed, Jan 1 2020 9:12 AM | Last Updated on Wed, Jan 1 2020 9:12 AM

Jagadish Reddy Speech At Nalgonda District - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, నల్లగొండ: ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేస్తూ కాల్వల కింద చివరి భూములకు సాగునీరు అందించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. మంగళవారం నల్లగొండ మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని స్థానిక ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తలాపున సాగర్‌ నీరు పారుతున్నా జిల్లా రైతాంగానికి తాగు, సాగు నీరు అందించాలన్న సోయి కాంగ్రెస్‌ పాలకులకు రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాల్వ చివరి భూములకు కూడా నీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులు, ఎన్నికల సంఘంపై మాట్లాడే తీరును బట్టి మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించినట్లు తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్, బీజేపీలకు లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పద్మావతికి టికెట్‌ ఇవ్వొద్దని ఒకరు, ఇచ్చినా గెలవదని ఇంకొకరు, గెలిపించుకోవాలని అంతా కలిసి ప్రచారం చేసినా ఫలితం దిమ్మతిరిగేలా వచ్చిందని గుర్తు చేశారు.

కౌంటింగ్‌కు ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ బీజేపీ గెలుస్తున్నట్లు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నట్లుగా ఎగిరెగిరి పడ్డా 200 ఓట్లు కూడా ఆ పార్టీ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు. పార్టీలో టికెట్లు ఎవరికి వచ్చినా కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాను టీఆర్‌ఎస్‌ ఖిల్లాగా ప్రజలు మార్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరన్నారు. పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ గెలుపు గుర్రాలకే టికెట్‌ ప్రకటిస్తామని, రానివారు ఇతరుల ఓటమికి కుట్రలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ కోమటిరెడ్డిని ఓడించినప్పుడే కాంగ్రెస్‌ పని అయిపోయిందన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పాత, కొత్త నాయకత్వం తేడా లేకుండా సామాజిక అంశాలను కూడా పరిగణించి టికెట్లు కేటాయిస్తామన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పాలకమండలి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సమావేశంలో వేమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, పూల రవీందర్, రేఖల భద్రాద్రి, చీర పంకజ్‌ యాదవ్, బక్కా పిచ్చయ్య, మాలె శరణ్యారెడ్డి, బోయపల్లి కృష్ణారెడ్డి, సుంకరి మల్లేశ్‌గౌడ్, బోనగిరి దేవేందర్, మైనం శ్రీనివాస్, సింగం రామ్మోహన్, అమరేందర్‌రెడ్డి, అబ్బగోని రమేశ్‌గౌడ్, దేప వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బొర్ర సుధాకర్, రవీందర్‌రావు, ఐతగోని యాదయ్య, సింగం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

గతంలో కరెంట్‌ లేక ఇబ్బందులు పడ్డ విద్యార్థులు
గత పాలకుల తీరువల్ల కరెంట్‌ లేక పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల తరహాలోనే మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో కాంగ్రెస్‌ మంచుకొండలాగా కరిగి గులాబీ ఖిల్లాగా మారిందని పేర్కొన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement