సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థుల జాబితాపై నెలకొన్న ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెరదించారు. గురువారం రాత్రి మొత్తం 17 మంది సభ్యుల జాబితాను ప్రకటించారు. అనుకున్నట్లుగానే.. పాత వారిలో ఏడుగురికి విశ్రాంతినిచ్చి 10 కొత్తముఖాలకు చోటిచ్చారు. ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించగా, గతంలో ఎంపీలుగా పనిచేసి ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నికయిన రెండు స్థానాలతో పాటు మరో 8 చోట్ల కొత్త అభ్యర్థులను బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మల్కాజ్‌గిరి స్థానాన్ని ఆశించిన నవీన్‌రావులను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కేసీఆర్ ప్రకటించారు.
ఆ ఏడు చోట్ల: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం లభించింది. కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), బోయినపల్లి వినోద్‌కుమార్ (కరీంనగర్), పసునూరి దయాకర్ (వరంగల్), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), గోడెం నగేశ్ (ఆదిలాబాద్), బీబీ పాటిల్ (జహీరాబాద్), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్)లకు మళ్లీ టికెట్ లభించింది. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం), జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సీతారాంనాయక్ (మహ బూబాబాద్)లకు భంగపాటు ఎదురైంది. చివరి వరకు తమ వైపు మొగ్గుచూపుతారనే ఈ ముగ్గురు ఆశలు పెట్టుకున్నప్పటికీ.. కేసీఆర్ వారికి టికెట్ నిరాకరించారు. ఇద్దరు మంత్రుల కుటుంబ సభ్యులు రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని మల్కాజ్‌గిరి బరిలో దింపింది టీఆర్‌ఎస్. ఈయన పౌల్ట్రీ వ్యాపారి. మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌ను సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలో దింపింది. ప్రస్తుత శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యానాయక్ కుమార్తె మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మహబూబాబాద్ నుంచి పోటీ చేయనున్నారు.
ఖమ్మం, పెద్దపల్లి.. అనూహ్యం
ఖమ్మం, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలను సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఖరారు చేశారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ పొంగులేటికి అవకాశం ఇవ్వకపోతే అక్కడి నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు అవకాశమిచ్చారు. పెద్దపల్లి నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బాల్క సుమన్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో అక్కడి మాజీ ఎంపీ జి.వివేకానంద టికెట్ ఆశించారు. కానీ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఎక్సైజ్ మాజీ అధికారి వెంకటేశ్ నేతకానికి టికెట్ ఖరారైంది.
కొండా స్థానంలో..
చేవెళ్ల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొంది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్థానంలో పౌల్ట్రీ వ్యాపారి రంజిత్‌రెడ్డిని బరిలో దించారు. ఈయన పేరుపై చాలాకాలం క్రితమే ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే.. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చనే చర్చ జరిగింది. కానీ, కేసీఆర్ మాత్రం చేవెళ్ల బరిలో రంజిత్‌రెడ్డికే అవకాశమిచ్చారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తిగా లేకపోవడంతో అక్కడ మునుగోడు మండలం చల్మెడ గ్రామానికి చెందిన వేముగంటి నర్సింహారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. సివిల్ ఇంజనీర్ అయిన నర్సింహారెడ్డి 1997 నుంచి స్నేహిత అగ్రిబయోటెక్ ఎండీగా, 2012 నుంచి వీజీఎస్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
మాజీ మంత్రికి చాన్స్
నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా మాజీ మంత్రి పి.రాములుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా టికెట్ ఆశించినప్పటికీ రాములు వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. సిట్టింగ్ ఎంపీకి టికెట్ నిరాకరించిన మహబూబ్‌నగర్ పార్లమెంటు అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డిని ఖరారు చేశారు. ఎంఎస్‌ఎన్ లేబరేటరీస్ లిమిటెడ్ అధినేత డాక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి సోదరుడయిన శ్రీనివాస్‌రెడ్డి కాంట్రాక్టర్‌గా ఉన్నారు. హైదరాబాద్ లోక్‌సభకు స్థానిక టీఆర్‌ఎస్ నేత పుస్తె శ్రీకాంత్‌ను బరిలో దించారు.
మధ్యాహ్నం నుంచే కోలాహాలం
టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఈనెల 21న వెల్లడించనున్నట్టు నిజామాబాద్ సభలో కేసీఆర్ ప్రకటించడంతో గురువారం మధ్యాహ్నం నుంచే ప్రగతిభవన్ వద్ద కోలాహలం మొదలైంది. టికెట్ ఖరారైన వారు, ఆశిస్తున్న నేతలు, వారి అనుచరులు ప్రగతిభవన్‌కు క్యూ కట్టారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు, మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేసీఆర్ గురువారం సాయంత్రం కూడా భేటీ అయ్యారు. వీరితో అన్ని అంశాలు చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం వారికి బీఫారంలు కూడా గురువారం రాత్రే కేసీఆర్ చేతుల మీదుగా అందజేశారు.
టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థులు వీరే:
1. కరీంనగర్: బోయినపల్లి వినోద్ కుమార్
2. పెద్దపల్లి: బోర్లకుంట వెంకటేశ్ నేతకాని
3. ఆదిలాబాద్: గోడెం నగేశ్
4. నిజామాబాద్: కల్వకుంట్ల కవిత
5. జహీరాబాద్: బీబీ పాటిల్
6. మెదక్: కొత్త ప్రభాకర్ రెడ్డి
7. వరంగల్: పసునూరి దయాకర్
8. మహబూబాబాద్: మాలోత్ కవిత
9. ఖమ్మం: నామా నాగేశ్వరరావు
10. భువనగిరి: బూర నర్సయ్యగౌడ్
11. నల్గొండ: వేమిరెడ్డి నర్సింహా రెడ్డి
12. నాగర్ కర్నూల్: పోతుగంటి రాములు
13. మహబూబ్ నగర్: మన్నె శ్రీనివాస్ రెడ్డి
14. చేవెళ్ల: డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
15. సికింద్రాబాద్: తలసాని సాయికిరణ్ యాదవ్
16. మల్కాజిగిరి: మర్రి రాజశేఖర్ రెడ్డి
17. హైదరాబాద్: పుస్తె శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment