
న్యాలకొండ అరుణ కనమల్ల విజయ బాదినేని రాజేందర్ పుట్టమధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రాదేశిక ఎన్నికల్లో మరోసారి కారు దూసుకుపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాల కన్నా మిన్నగా జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లను ఏకపక్షంగా కైవసం చేసుకునే మెజారిటీ సాధించిన టీఆర్‌ఎస్, ఎంపీపీ స్థానాల్లో కూడా దాదాపు అన్ని మండలాలను సొంతం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 58 జెడ్‌పీటీసీలకు గాను 54 స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. కేవలం నాలుగు స్థానాలతో కాంగ్రెస్ రెండోస్థానంలో నిలవగా, బీజేపీ ఖాతా తెరవలేదు. కరీంనగర్ జిల్లాలోని 15 జెడ్‌పీటీసీ స్థానా లను టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. పెద్దపల్లి జిల్లాలో మాత్రమే 15 స్థానాలకు గాను పదమూడు చోట్ల టీఆర్‌ఎస్ విజయం సాధించగా, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయాన్ని అందుకున్నారు.
ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేవలం ఒక్కో సీటులో కాంగ్రెస్ గెలిచింది. ఇక ఎంపీటీసీ స్థానాల్లో కూడా ఉమ్మడి జిల్లాలోని 653 స్థానాలకు 402 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 114 స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ 47, సీపీఐ 3, టీడీపీ ఒక స్థానంలో గెలుపొందింది. కాగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ తరువాత అత్యధికంగా 86 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. కాగా టీఆర్‌ఎస్ మెజారిటీ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు అన్ని మండలాల్లో మిగతా పక్షాల కన్నా టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించడంతో ఎంపీపీల గెలుపు నల్లేరు మీద నడకే.
9 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్(సిద్దిపేట జిల్లా) మినహా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 58 జెడ్‌పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ 54 గెలుచుకొని పార్లమెంటు తీర్పుకు స్థానిక ఫలితాలకు సంబంధం లేదని నిరూపించింది. కరీంనగర్ నియోజకవర్గంలోని రెండు జెడ్‌పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకోగా, కొత్తపల్లి మండలంలో ఏకంగా 8 ఎంపీటీసీలను ఆ పార్టీ కైవసం చేసుకొంది. ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ రావడం గమనార్హం. పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్, ఓదెల స్థానాలు, వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి, జగిత్యాలలోని బీర్పూరు మినహా మిగతా 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో కారు క్లీన్‌స్వీప్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కోల్పోయిన మంథని నియోజకవర్గంలో ఈసారి అన్ని సీట్లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి పుట్టా మధు కమాన్‌పూర్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. రామగుండంలో సైతం కోరుకంటి చందర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.
ఎంపీ సంజయ్‌కు మెజారిటీ ఇచ్చిన స్థానాల్లో సైతం...
ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎంపీ సంజయ్‌కుమార్‌కు మెజారిటీ ఇచ్చిన అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే భారీ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండిలలో టీఆర్‌ఎస్ క్వీన్‌స్వీప్ చేయగా, వేములవాడలో కేవలం ఒక్క సీటును కాంగ్రెస్‌కు కోల్పోయింది. కాగా బీజేపీ ఈ నియోజకవర్గాల్లో ఒక్క జెడ్‌పీటీసీ స్థానాన్ని గెలుచుకోలేదు. చొప్పదండిలో మాత్రం కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.
జెడ్‌పీ పీఠాలు వీరికే!
ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లా పరిషత్‌లలో టీఆర్‌ఎస్ జెండా ఎగురుతుండడంతో పీఠాలపై ఆసీనులు అయ్యేదెవరో దాదాపుగా తేలిపోయిం ది. పెద్దపల్లిలో పుట్ట మధు, సిరిసిల్లలో కోనరావుపేట జెడ్పీటీసీ న్యాలకొండ అరుణ ఇప్పటికే ఖరా రయ్యారు. కరీంనగర్‌లో మంత్రి ఈటల ప్రాతిని ధ్యం వహిస్తున్న హుజూరాబాద్ సెగ్మెంట్ పరిధి లోని ఇల్లందకుంట జెడ్‌పీటీసీ కనుమల్ల విజయ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆమె గతంలో కూడా జమ్మికుంట జెడ్‌పీటీసీగా వ్యవహరించిన నేపథ్యంలో ఆమెకే చాన్స్. ఇక జగి త్యాల(బీసీ జనరల్)లో బుగ్గారం జెడ్‌పీటీసీ బాది నేని రాజేందర్‌కు అవకాశం దక్కనుందని సమాచారం. కోరుట్ల జెడ్‌పీటీసీ దారిశెట్టి లావణ్య కూడా రేసులో ఉన్నప్పటికీ, జనరల్ బీసీకి రిజర్వు అయిన ఈ స్థానంలో లావణ్యకు అవకాశం అనుమానమే.
Comments
Please login to add a commentAdd a comment