టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం | TRS rule comes to climax | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం

Published Fri, Mar 9 2018 8:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TRS rule   comes to climax - Sakshi

సభకు హాజరైన జనం.......కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి కుంతియా......ఖడ్గంతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/హుజూరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన ఆడుతున్న ఫెడరల్, థర్డ్‌ఫ్రంట్‌ డ్రామాకు ప్రజలు బుద్ధి చెప్తారని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడుతున్న కొత్త నాటకానికి కూడా తెరవేసే సమయం ఆసన్నమైందని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చని     సీఎం కేసీఆర్‌.. డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు వెళ్తే     ప్రజలు నిలదీస్తారని భావించి వారిని తప్పుదోవ పట్టించేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నారు.

టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత ప్రజాచైతన్య బస్సుయాత్ర ముగింపు సభ గురువారం రాత్రి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కటకం మత్యుంజయం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామచంద్రకుంతియా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌తో పట్టం కడితే, ఆ ప్రజలకు మేలు చేసే అంశాలను మరిచిన కేసీఆర్‌ రోజుకోతీరుగా బక్వాసు మాటలు మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే కేవలం కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందన్నారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో సీఎం కేసీఆర్‌ నాటకాలు ఆడుతున్నారని.. కాంగ్రెస్‌ బస్సుయాత్రకి ఎవరూ రావడం లేదని కేసీఆర్‌ అంటున్నారని, ఆయన మాటలకు హుజూరాబాద్‌లో జరిగే ఈ సభే సమాధానం చెబుతుందన్నారు. ఈ సభని చూస్తే మంత్రి ఈటల రాజేందర్‌ పనైపోయినట్టే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. 2019లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ రైతాంగానికి రూ.4 వేలు ఎకరానికి ఈ మేనెలలోనే ఇస్తామంటూ ఓట్లకోసమే డ్రామాలు అడుతున్నాడన్నాడన్నారు. గిట్టుబాటు, మద్దతు ధర కోసం అనేక ఆందోళనలు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుచేయని విషయాన్ని ప్రజలు మరిచపోలేదన్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం అప్రజాస్వామిక పరిపాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకే బస్సుయాత్ర చేపట్టామన్నారు. విద్యాహక్కు చట్టం, వందరోజుల పని, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీయే అని అన్నారు.

రూ.300 కోట్ల ట్రాక్టర్ల సబ్సిడీ కుంభకోణం..

ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసిఆర్, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అప్పుల రాష్ట్రంగా చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాటు సమయంలో రూ.69 వేల కోట్లు అప్పు ఉంటే, ప్రస్తుతం రూ.2 లక్షల కోట్లకు పెరిగిందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ పభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కేవలం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేస్తూ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని, నాలుగేళ్ల కాలంలో నాయకులు ఎన్ని వేల కోట్లు దోచుకొని ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు.

ప్రధానంగా తెలంగాణలో ప్రజలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాగుబోతులను చేసి, రూ.వేల కోట్లు గుంజుకుంటోందని పేర్కొన్నా రు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆబ్కారీ శాఖ ఆదా యం రూ.8 వేల కోట్లు ఉంటే, ప్రస్తుతం ప్రభుత్వ ఆదా యం రూ.20 వేల కోట్లకు చేరిందని తెలిపారు. ఎస్సారెస్పీ ద్వారా చివరి ఆయకట్టు రైతులకు సాగునీరందిస్తామని చెప్పిన మంత్రి ఈటల రాజేందర్, మిడ్‌మానేరు నీళ్లను మంత్రి హరీష్‌రావు తీసుకెళ్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన సీఎం కేసిఆర్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపుగా 4 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు. 

∙ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సోనియాగాందీ దయతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. జమ్మికుంట పట్టణంలో 20 రోజులకోసారి తాగునీళ్లు వచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఇక్కడ అభివృద్ధి ఏ మేరకు జరుగుతుందో అర్థమవుతుందన్నారు. ధనిక రాష్ట్రమని గొప్పులు చెప్తున్న సీఎం కేసిఆర్, 4 ఏళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేయగా.. అందులో సీఎం విలాస జీవితానికే అధికం మొత్తంలో నిధులు ఖర్చు చేసుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. సీఎం, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో మాత్రమే డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోందని.. ఇతర జిల్లాల్లోని మంత్రులు మాత్రం ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్‌ మద్దతుతో గెలిచిన మంత్రి ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ లేకుండా చేస్తాననడం ఆయన తరం కాదని పేర్కొన్నారు. 

∙ నాలుగేళ్లుగా రాష్ట్రంలో దమనకాండ జరుగుతోందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. మంత్రి ఈటల రాజేందర్‌ నియోజకవర్గంలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. వీణవంక మండలంలో అత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబానికి ఏళ్లు గడుస్తున్నా న్యాయం చేయలేదని విమర్శించారు. ప్రజలను మాటలతోనే మభ్యపెడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని పేర్కొన్నారు. రూ.17 వేల కోట్లు అదనంగా ఉన్న బడ్జెట్‌ను మంత్రి ఈటల రాజేందర్‌.. ఇప్పుడు లోటు బడ్జెట్‌గా చేసి ఖజానా ఖాళీ చూపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 2.18 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, దళితులకు మూడెకరాల భూమి అందని ద్రాక్షగానే మిగిలిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లను డబుల్‌ రోడ్లు వేస్తూ, డబుల్‌రోడ్లుగా ఉన్న వాటిని ఫోర్‌లేన్‌గా వేస్తేనే అభివృద్ధి చేసినట్లా అని ప్రశ్నించారు.

మాజీ ఎంపీ హన్మంత్‌రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసిఆర్‌ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని సోనియాగాందీ వద్ద చెప్పిన సీఎం కేసీఆర్‌ మోసం చేశారని విమర్శించారు. దళితుడినే సీఎం చేస్తానని చెప్పి మోసం చేశాడని, నక్సలైట్ల ఎజెండానే టీఆర్‌ఎస్‌ ఎజెండా అని చెప్పి, నక్సలైట్లనే పిట్టల్లా కాల్చి చంపతున్నాడని విమర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లికి రాజ్యసభ సీటు ఇవ్వాలన్నారు. ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన తర్వాత ఢిల్లీకి వెళ్లాలని హితవు పలికారు. 

మాజీ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. ముగింపు సభకు వచ్చిన రాష్ట్ర నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో శాసనమండలి ఫ్లోర్‌లీడర్‌ షబ్బీర్‌అలీ, వి.హన్మంతరావు, మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, బలరాంనాయక్, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు టి.సంతోష్‌కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి, నేరేళ్ల శారద, రమ్యారావు,  వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ప్యాట రమేష్, స్వర్గం రవి, పరిపాటి రవీందర్‌రెడ్డి, విజయరమణారావు, మల్లు రవి, సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, దొమ్మాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.  


ఆర్థిక, పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం..హుజూరాబాద్‌ సభలో     ఎనుముల రేవంత్‌రెడ్డి

ఆదర్శాలను వల్లించే హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక, పౌరసరఫరాల శాఖలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, కోట్ల రూపాయలను మంత్రి రాజేందర్‌ అక్రమంగా సంపాదించుకున్నారని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్‌లో బస్సుయాత్ర ముగింపు సభలో మాట్లాడిన ఆయన మంత్రి ఈటల రాజేందర్‌ టార్గెట్‌గా ఘాటైన ఆరోపణలు చేశారు.

కస్టమ్‌ మిల్లింగ్‌ కింద రైసుమిల్లర్లకు రారైసుకు క్వింటాల్‌కు రూ.15లు, బాయిల్డ్‌కు క్వింటాల్‌కు రూ.25 చెల్లించాల్సి ఉండగా, రూ.30, రూ.50లకు పెంచి రూ.70 కోట్ల అదనపు భారం పడేలా చేశారని, ఇందులో పెద్దమొత్తంలో చేతులు మారాయన్నారు. రవాణా, ఇతర ఖర్చుల కింద మిల్లర్లకు రూ.270 కోట్లు చెల్లించారని, ఇందులోనూ పెద్ద మొత్తంలో లంచంగా తీసుకోగా, ఆడిట్‌ అభ్యంతరాలతో బయటపడిందన్నారు.

వీటిని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తే మిల్లర్లు సమ్మెకు దిగారన్నారు. 2014–15 సంవత్సరంలో కేంద్రం లెవీ కింద లక్ష మెట్రిక్‌ టన్నుల బియ్యం చెల్లించామని రూ.1,670 కోట్లకు ప్రతిపాదనలు పంపిన దానిలో రూ.600 కోట్ల మేరకు చేతులు మారితే తాను చేసిన ఫిర్యాదుల మేరకు కేంద్రం విచారణ జరిపిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరిట రూ.కోట్ల కుంభకోణం జరిగితే.. ఆర్థికశాఖ మంత్రి గుడ్డిగా సంతకం చేసిన మంత్రి ఈటల రాజేందర్‌.. కేసీఆర్‌ అక్రమాలలో కీలకపాత్ర ధారని రేవంత్‌ విమర్శించారు. కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయన వెంట ఈటల రాజేందర్‌ కూడా వెళ్లక తప్పదన్న రేవంత్‌రెడ్డి.. తాను విసిరిన సవాళ్లకు దమ్ముంటే విచారణకు రావాలని అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement