‘కంచర్ల’కా.. ‘తేరా’నా? | TRS Suspension Nalgonda MP Set | Sakshi
Sakshi News home page

‘కంచర్ల’కా.. ‘తేరా’నా?

Published Wed, Mar 6 2019 8:18 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

TRS Suspension Nalgonda MP Set - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంటు స్థానానికి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయడానికి ఎవరికి టికెట్‌ దక్కనుంది..? పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ మదిలో ఎవరున్నారు..? కనీసం నలుగురు దాకా నాయకులు టికెట్‌ రేసులో ఉండగా.. ఆశావహుల సంఖ్యను వడబోత ఎలా చేశారు..? ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ గుత్తా తిరిగి పోటీచేసే అవకాశాలు దాదాపు లేవా..? ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది..? ఇవీ.. ప్రస్తుతం ఎంపీ టికెట్ల కేటాయింపునకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో నడుస్తున్న ముచ్చట్లు..! ఈ వారంలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఆయా పార్టీలూ పోరుకు తయారవుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించిన అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలోని తాజా పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చిన నాయకత్వం నల్లగొండ ఎంపీ స్థానాన్ని కీలకంగా భావిస్తోంది. భువనగిరి నుంచి ఎలాంటి మార్పు లేకుండా ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ డాక్టర్‌ బూర నర్స య్య గౌడ్‌కే మళ్లీ టికెట్‌ ఖాయం చేసినట్లు చెబుతున్నారు.

అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉందని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే భువనగిరి స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెం ట్లలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, సిట్టింగ్‌ ఎంపీ, జిల్లా మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్ర టత్యేకంగా భేటీ ఆయ్యారు. ఆ నియోజకవర్గం లోని తాజా రాజకీయ పరిస్థితి సమీక్షించారు. ఇక్క డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినట్టేనని, మార్పు ఉండకపోవచ్చని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ నల్లగొండ ఎంపీ స్థానంపై పడింది.

‘కంచర్ల’కా... ‘తేరా’నా..?
నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పార్టీ టికెట్‌ సంపాదించి పోటీ చేయాలని నలుగురైదుగురు నాయకులు ఆశించారు. పార్టీ నాయకత్వం ఓ ఇద్దరు నేతల పేర్లపై సర్వే కూడా నిర్వహించినట్లు సమాచారం. ముందునుంచీ టికెట్‌ ఆశిస్తున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, పార్టీ నాయకుడు తేరా చిన్నపరెడ్డి ప్రస్తుతం అధినేత వద్ద పరిశీలనలో ఉన్న పేర్లని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో జరగనున్న నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ నేతల సమావేశంలో దాదాపుగా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచి ఊరించిన నల్లగొండ అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్‌ గెలుపులో, తన సోదరుడిని ఎమ్మెల్యేగా గెలిపించడంలో కంచర్ల కృష్ణారెడ్డి కీలకంగా పనిచేశారని పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతోందని చెబుతున్నారు. అంతేకాకుండా, పార్టీలో చేరిన సమయంలో భూపాల్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఖరారు చేసిన సందర్భంలో కూడా లోక్‌సభ స్థానంలో కృష్ణారెడ్డి పోటీపై చర్చ జరిగిందంటున్నారు. దీంతో ఈసారి ఎంపీ టికెట్‌ ఆయనకే దక్కుతుందన్న ఆశాభావాన్ని కంచర్ల సోదరుల అనుచరవర్గం వ్యక్తం చేస్తోంది. మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన తేరా చిన్నపరెడ్డి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి స్థానిక సంస్థల ఎ మ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయారు. మరోసారి ఆయన నల్లగొండ ఎంపీ స్థానంనుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని, అధిష్టానం ప రిశీలనలో ఆయన పేరు కూడా ఉందంటున్నారు.
 
అన్ని బాధ్యతలూ.. మంత్రి జగదీశ్‌కే!
రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగదీశ్‌రెడ్డికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి అన్ని బాధ్యతలనూ అధినాయకత్వం అప్పజెప్పిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల విజయాన్ని ఆయన సవాల్‌గా తీసుకున్నారని అంటున్నారు. భువనగిరిలో ఎలాగూ సిట్టింగ్‌ అభ్యర్థే కావడంతో నల్లగొండపై ప్రధానంగా దృష్టి పెట్టారని సమాచారం. కంచర్ల సోదరులను టీడీపీనుంచి టీఆర్‌ఎస్‌లోకి తీసుకురావడంలో మంత్రి జగదీశ్‌రెడ్డిదే ప్రధాన పాత్ర.

తేరా చిన్నపరెడ్డిని ఎమ్మెల్సీగా పోటీ చేయిం చిన సందర్భంలోనూ ఆయన గెలుపు కోసం మం త్రి చేసిన కృషిని ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇప్పుడు కంచర్ల కృష్ణారెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు ఎంపీ అభ్యర్థులుగా అధినేత పరిశీలనలో ఉన్నాయని, వీరిద్దరిలో ఎవరికి టికెట్‌ దక్కినా, మంత్రి జగదీశ్‌ మనుషులకు దక్కినట్టేనని విశ్లేషిస్తున్నారు. ఈనెల 17న నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నల్లగొండలో జరగనుంది. సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరు కానున్నారు. ఈలోగానే ఈ నియోజకవర్గ ఆశావహులు, ఎమ్మెల్యేలు, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇన్‌చార్జులతో అధినేత కేసీఆర్‌ వద్ద ప్రత్యేక భేటీ ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement