హైదరాబాద్: తెలంగాణా భవన్‌లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యాలయంలో కార్మిక విభాగం జెండా ఎగురవేసి ప్రసంగించారు. పరిశ్రమలు రావడమే కాదు.. కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన కనీస వేతనాలు అందాలనేదే సీఎం కేసీఆర్ విధానమన్నారు. అంగన్‌వాడీ కార్మికులకు రెండు సార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేన్నారు.సింగరేణి కార్మికులకు అత్యధిక బోనస్ ఇవ్వడంతో పాటు వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించింది కేసీఆర్‌యేనని చెప్పారు.
హోంగార్డులు, జీహెచ్‌ఎంసీ స్వీపర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచిన కార్మిక పక్షపాతి కేసీఆర్ అని కొనియాడారు. కార్మికులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేందుకు సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్మికులకు వారు పనిచేసే చోటే నివాస సదుపాయం కల్పించాలనేదే సీఎం ఆలోచన అని తెలిపారు. పరిశ్రమలలో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు కల్పించాలనేది తమ ధ్యేయమన్నారు.
ఇంటర్ సమస్యను రావణ కాష్టంలా రగిలిస్తున్నాయ్!
ప్రతిపక్షాలు ఏ అంశం లేకనే ఇంటర్‌మీడియట్ సమస్యను రావణ కాష్టంలా రగిలిస్తున్నాయని మండిపడ్డారు. తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు గ్లోబరెనా సంస్థకు టెండర్ దక్కితే తప్పును తనకు అంటగడుతున్నారని విమర్శించారు. రూ.4 కోట్ల 30 లక్షల టెండర్‌లో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కొందరు దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సమస్య సున్నితమైంది కాబట్టి అందరూ సంయమనం పాటించాలని కోరారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలకు వేరే అంశాలు చాలా ఉన్నాయని సూచించారు.
ఓ బఫూన్ పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా అని ప్రశ్నించారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా అని అడిగారు. హైకోర్టులో ఇంటర్ కేసు విచారణ జరుగుతోంది.. కోర్టు దోషులుగా తేల్చిన వాళ్లను శిక్షించాలని తానే ప్రభుత్వాన్ని మొదట డిమాండ్ చేస్తానని తెలిపారు.ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది.. అప్పటి దాకా అందరూ ఓపిక పట్టాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment