
తెలంగాణలో విద్యావ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్ సర్వనాశనం చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ హామీ ఇచ్చిన కేజీ టూ పీజీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన టీచర్స్ సమస్యలను పరిష్కరించడాన్ని ముఖ్యమంత్రి మర్చిపోయారన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేంతవరకు కాంగ్రెస్ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఉద్యోగుల హెల్త్ కార్డులు పనిచేయకున్నా సర్కార్‌కు ఏమాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఉద్యోగికి కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే ఇప్పటికీ ఖాళీలు భర్తీ కావడం లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రైవేటు రంగంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేకపోయింది.. అందుకే కాంగ్రెస్ నిరుద్యోగులకు 3 వేల నిరుద్యోగ భృతిని ప్రకటించినట్టు ఉత్తమ్ తెలిపారు.
మరోవైపు గాంధీభవన్‌లో డీఎడ్ అభ్యర్థులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. మార్కుల పర్సెంటేజ్ అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నష్టపోతున్నామని అభ్యర్థులు ఆయనకు వివరించారు.