మాజీ మంత్రి (డీఎల్‌రవీంద్రారెడ్డి) టీడీపీ ఇన్‌చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్
వైఎస్‌ఆర్ జిల్లా , మైదుకూరు టౌన్ : మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్‌కు పార్టీ అధిష్టానం టీటీడీ చైర్మన్ పదవి ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైదుకూరులో పుట్టా ఇన్‌చార్జ్‌గా కొనసాగుతారా...? మరొకరికి ఇస్తారా...? అనేది ఆ పార్టీ నాయకులతో పాటు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గ బాధ్యతలతోపాటు టీటీడీ చైర్మన్‌గా కూడా తానే కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో తానే పోటీలో ఉంటానని పుట్టా తెగేసి చెబుతున్నారు. కొంతమంది ఆ పార్టీలోని వారే పుట్టాను పక్కన పెట్టేందుకే టీటీడీ చైర్మన్ పదవి కట్టబెడుతున్నారని.. ఇక మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకొని అతనికే ఇన్‌చార్జ్ ఇస్తారని చెబుతున్నారు. కానీ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం తనకు ఇన్‌చార్జ్ పదవితో పాటు నియోజకవర్గంలో మరెవ్వరూ తన విషయంలో జోక్యం చేసుకోరాదని షరతులు పెడుతున్నట్లు సమాచారం. పుట్టాకు టీటీడీ చైర్మన్ ఇస్తే ఆ పదవి క్యాబినెట్ హోదాతో సమానమని, ఆయన రాజకీయంగా ఇంకా బలపడుతారని, తాను ఆ పార్టీలోకి వెళ్లి ఎలా ఉనికి చాటుకోవాలో అనే సందిగ్ధంలో డీఎల్ కాస్త వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.
అంతేకాదు... డీఎల్ తనకు సంబంధించిన వర్గీయులను పిలిపించుకొని ఏ పార్టీలోకి వెళితే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుకొంటున్నట్లు తెలిసింది. డీఎల్ మాత్రం ఏపార్టీలోకి వెళ్లినా తనదే పైచేయి ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే డీఎల్ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేక ఇండిపెండెంట్ అ«భ్యర్థిగా 2019 ఎన్నికల్లో పోటీచేస్తారా.. అనేది అంతు చిక్కడం లేదు. దీనికితోడు కొంతమంది పుట్టా వర్గీయులు, ఆయన సామాజికవర్గం వారు డీఎల్ పార్టీలోకి వస్తే తాము పనిచేయడం కష్టమని.. మీరు ఇన్‌చార్జ్‌గా ఉంటేనే మీ వెంట నడుస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది. మరికొంత మంది ఇప్పటి వరకు టీడీపీలోకి ఎవ్వరిని బడితే వారిని పుట్టా చేర్పించుకున్నారని, క్యాడర్‌కు విలువ ఇవ్వకుండా వెనకవచ్చినవారికే లబ్ధిచేకూరేలా వ్యవహరించారని, ఆయనను ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించి డీఎల్ రవీంద్రారెడ్డిని తీసుకొంటే తమ ఉనికి చాటుకోవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా పుట్టాకు టీటీడీ చైర్మన్ పదవి.. మైదుకూరు ఇన్‌చార్జి వ్యవహారం, డీఎల్ టీడీపీలో చేరుతాడా..లేదా అనే దానిపై నియోజకవర్గవ్యాపితంగా చర్చోప చర్చలు జరుగుతున్నాయి.