సాక్షి, ఢిల్లీ: సీపీఎం కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశాలు మంగళవారం ముగిశాయి. సమావేశంలో బ్యూరో సీపీఎం మహాసభలలో తీసుకున్న నిర్ణయాల అమలు, భాద్యతల అప్పగింత అంశాలపై చర్చించింది. 22వ సీపీఎం అఖిల భారత మహాసభల తరువాత మొదటిసారి భేటీ అయిన పోలిట్ బ్యూరో ఇది. జూన్ 22 నుంచి 24 వరకు కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహించి పోలిట్ బ్యూరోలో చర్చించిన అంశాలను కేంద్ర కటిటీ ముందుంచనున్నారు. సీపీఎం పోలిట్ బ్యూరో కర్ణాటక రాజకీయ పరిణామాలను స్వాగతించింది. రేపు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరుకానున్నారు.
సమావేశంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసిందన్నారు. బీజేపీ ప్రజాతీర్పును కాదని గోవా, మణిపూర్, మేఘాలయ, బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పరచినట్లుగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కాంగ్రెస్, జెడిఎస్‌కు 56.6 శాతం ప్రజలు ఓటు వేశారు. కానీ అధిక సీట్లు వచ్చిన బీజేపీకి కేవలం 36.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఏచూరి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా పెరిగాయి. గడిచిన నాలుగేళ్ళలో గ్రామీణ భారతం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, గతంలో ప్రజలు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదని తెలిపారు. నోట్లరద్దు, జీఎస్టీ వల్ల ప్రజలపై ఆర్థిక భారాలు మరింత పెరిగాయాయని, వారిపై భారం పెంచుతూ 11 లక్షల కోట్ల రుణాలను బడా కార్పోరేట్లకు బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందని, ప్రజలపై మోడీ ప్రభుత్వం వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సీపీఎం పిలుపునిచ్చింది.
‘త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సీపీఎం కార్యకర్తలపై దాడులు పెరిగాయి. ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. 50 పార్టీ కార్యాలయాలు ధగ్దం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీ దాడులతో 500 కార్యకర్తలు ఇళ్ళను వదిలి పార్టీ ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో ఉంటున్నారు.’అని సీపీఎం పోలిట్ బ్యూరో త్రిపురలో సీపీఎం కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించింది. అదేవిధంగా బీజేపీ బెంగాల్‌లో మమత సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పంచాయతీ ఎన్నికలలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, బెంగాల్ లో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేసే హక్కును కోల్పోయారు. అలాంటిది బెంగాల్‌లో హింసను ప్రేరేపిస్తూ.. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గురించి మమత బెనర్జీ మాట్లాడటం హాస్యాస్పదమని ఏచూరి అన్నారు.
అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో మైనారిటీలు వివక్షకు గురవుతున్నారు. సిటిజన్ షిప్ యాక్ట్ అమలులో మత ప్రాతిపదికను కేంద్రం అమలు చేస్తుంది. కేంద్రం సిటిజన్ షిప్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని బ్యూరో డిమాండ్ చేసింది. పార్లమెంట్‌లో సీపీఎం సిటిజన్ షిప్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందని సీతారాం ఏచూరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment