అష్ట దిగ్గజాల సరసన ఉద్ధవ్‌ ! | Uddhav Thackeray To Be 8th CM without Being MLA Or MLC | Sakshi
Sakshi News home page

అష్ట దిగ్గజాల సరసన ఉద్ధవ్‌ !

Published Fri, Nov 29 2019 2:08 PM | Last Updated on Fri, Nov 29 2019 2:08 PM

Uddhav Thackeray To Be 8th CM without Being MLA Or MLC - Sakshi

సాక్షి, ముంబై : విధాన్‌ సభ, విధాన పరిషత్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర ఎలాంటి సభ్యత్వ పదవులు చేపట్టకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఎనిమిదో వ్యక్తి. ఇదివరకు నేరుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వారిలో బారిస్టర్‌ ఏ.ఆర్‌.అంతులే, వసంత్‌దాదా పాటిల్, శివాజీరావ్‌ పాటిల్‌–నిలంగేకర్, శంకర్‌రావ్‌ చవాన్, శరద్‌ పవార్, సుశీల్‌కుమార్‌ షిండే, పృథ్వీరాజ్‌ చవాన్, తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నారు.  

ఆరు నెలల్లో.. 
నియమాల ప్రకారం సభాగృహంలో ఎలాంటి సభ్యత్వ పదవులు లేని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల కాలవ్యవధిలో విధానసభ లేదా విధాన పరిషత్‌లో సభ్యుడు కావల్సి ఉంటుంది. లేదంటే ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ, అదృష్టవశాత్తు ఇంతవరకు ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు. 1980లో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పటి ఎంపీ  వసంత్‌దాదా పాటిల్, ఎమ్మెల్యే ప్రతిభా పాటిల్‌ పేరు చర్చల్లో ఉన్నాయి. ఎంపీ పదవికి రాజీనామా చేసిన వసంత్‌దాదా పాటిల్‌ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావించారు. కానీ, కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఎమ్మెల్యే పదవి లేని కాంగ్రెస్‌ నేత బారిస్టర్‌ ఎ.ఆర్‌.అంతులేకు కట్టబెట్టారు.

ఉభయ సభలో ఎలాంటి పదవులు చేపట్టకపోయినా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా అంతులేకు ఘనత దక్కింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసి సభాగృహం సభ్యుడయ్యారు. 1982 జనవరి 12వ తేదీ వరకు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 1982 జనవరి 21వ తేదీన బాబాసాహెబ్‌ బోస్లే ముఖ్యమంత్రి అయ్యారు. ముంబైలోని కుర్లా నియోజక వర్గం నుంచి గెలిచారు. ఆ తరువాత 1983 ఫిబ్రవరి రెండో తేదీన ఎంపీ వసంత్‌ దాదా పాటిల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి విధాన్‌ పరిషత్‌ ద్వారా మంత్రివర్గంలోకి వచ్చారు.  

1993లో పవార్‌.. 
1985 జూన్‌ మూడో తేదీన శివాజీరావ్‌ పాటిల్‌– నిలంగేకర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఆయన విధాన పరిషత్‌కు ఎన్నికయ్యారు. అనంతరం నిలంగా అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికలో విజయఢంకా మోగించారు. కేంద్ర మంత్రిగా ఉన్న శంకర్‌రావ్‌ చవాన్‌ 1986 మార్చి 12వ తేదీన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. విధాన్‌ పరిషత్‌ ఎన్నికలో గెలిచి సభాగృహం సభ్యుడయ్యారు. 1993లో శరద్‌ పవార్‌ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ముంబైలో అల్లర్లు జరిగిన తరువాత సుధాకర్‌రావ్‌ నాయిక్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.  1993 మార్చి ఆరో తేదీన శరద్‌ పవార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. సభాగృహం సభ్యుడయ్యేందుకు విధాన్‌ పరిషత్‌ మార్గాన్ని ఎంచుకున్నారు.

2003 జనవరి 18వ తేదీన రాష్ట్ర పగ్గాలు సుశీల్‌కుమార్‌ షిండే చేతిలోకి వెళ్లాయి. అదికూడా ఢిల్లీ వదిలి వచ్చిన తరువాత షోలాపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీలోకి వెళ్లారు. అలాగే ఆదర్శ్‌ సొసైటీలో జరిగిన కుంభకోణం కారణంగా అశోక్‌ చవాన్‌ రాజీనామా చేయడంతో పృథ్వీరాజ్‌ చవాన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత ఆయన విధాన్‌ పరిషత్‌కు ఎన్నికయ్యారు. తాజాగా 2019 నవంబర్‌ 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే ఉభయ సభల్లో ఎలాంటి పదవుల్లో లేరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement