
దేవీచౌక్ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీదే విజయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం సాధిస్తుందని ఇటీవల ఓ ఛానల్‌లో వచ్చిన సర్వేపై ఆయన స్పందిస్తూ పై విధంగా సమాధానమిచ్చారు. అయితే ఎన్నికల మాంత్రికుడు చంద్రబాబును తక్కువగా అంచనా వేయకూడదన్నారు. ప్రత్యేక హోదా కోసం మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడని సీఎం చంద్రబాబు ఇప్పుడు హోదా అని అడిగితే ఎలా వస్తుందని ఉండవల్లి ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన జరిగిన తీరుపై ప్లారమెంటులో చర్చకు నోటీసు ఇవ్వాలని తాను కోరితే ఎవరూ ముందుకు రాలేదన్నారు. రాష్ట్ర విభజనపై తాను 2014లో సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసినట్లు చెప్పారు. విభజన అన్యాయంగా జరిగిందని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను జోడించి అదనపు అఫిడవిట్ దాఖలు చేసినట్లు ఉండవల్లి తెలిపారు. రాజకీయాల్లోనే ఉంటూ పదవీ రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. పోలవరం పాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక జాతికి అకింతం చేయాలని, కానీ చంద్రబాబు ఆ ప్రాజెక్టులో ఒక భాగమైన డయాఫ్రం వాల్‌ను జాతికి అంకితం చేసి కొత్త సంప్రదాయానికి తెరతీశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment