ఆకివీడు ఏరియల్ వ్యూ
కోటేశ్వరరావు, ఆకివీడు :సముద్ర తీరం వెంబడి, పశ్చిమ గోదావరి జిల్లాకు పడమర వైపున సరిహద్దుగా ఉండి నియోజకవర్గం ఉంది. పచ్చని పైరు పొలాలతో, పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఓ పక్క, ఆక్వాతో కాలుష్య బెడద మరోపక్క నియోజకవర్గాన్ని బెంబేలెత్తిస్తుంది. పట్టణ వాతావరణానికి దగ్గరగా ఉన్న ఉండి నియోజకవర్గం రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక, సేవా,ఉద్యమ రంగాలకు ఊతం ఇస్తూ గత చరిత్రను సంతరించుకుంది. 1955లో ఏర్పడిన నియోజకవర్గం 17వ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది.
అక్షరాయుధాలందించిన ఘనత
స్వాతంత్య్రోద్యమం కాలం నుంచి ఉండి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో ఉద్యమానికి ఊపిరిగా ఉండే ప్రసార సాధనాలైన పత్రికల్ని రహస్యంగా ముద్రించి, పడవలు, దోనెల్లో ప్రజలకు చేరవేసిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది. దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా, ఉద్యమానికి రహస్యంగా అక్షరాయుధాల్ని అందించిన ఘనత కూడా ఉంది. ప్రత్యేకాంధ్ర ఉద్యమం వంటి ఎన్నో ఉద్యమాలకు చేయూతనిచ్చి చరిత్రకెక్కింది. అల్లూరి సీతారామరాజు జన్మించిన మోగల్లు ఈ నియోజకవర్గంలోనే ఉంది. సర్దార్ దండు నారాయణరాజు, దండు సత్యనారాయణరాజు, ఉద్దరాజు రామం, పల్లి లక్ష్మీనర్శింహారెడ్డి, దండు విశ్వనాథరాజు, దాట్ల సూర్యనారాయణరాజు ఇలా ఎంతోమంది ఆ నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఈసీఐఎల్ ప్రాంతంలో ఏఎస్‌రావు నగర్ ఆవిర్భావానికి ఆద్యుడు అయ్యగారి సాంబశివరావు, స్వామి జ్ఞానానంద వంటి శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి చెందినవారే.
శ్రీవారి సేవలో పునీతం
ఎక్కడో ఉన్న ఏడుకొండల వాడికి ఉండి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు సేవ చేయడం ఎంతో అదృష్టమనే చెప్పాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు చైర్మన్‌లుగా పనిచేసి టీటీడీ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేశారు. గాదిరాజు జగన్నాథరాజు, గోకరాజు రంగరాజు, కనుమూరి బాపిరాజు, పాందువ్వ కనకరాజు, కనుమూరి అబ్బాయిరాజు టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు. ఆకివీడు మండలంలోని అయిభీమవరం గ్రామంలో టీటీడీ ఆధ్వరం్యలో వేద పాఠశాల ఉంది. ఉండి నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా ఏడుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ గెలుపొందగా, మరో ఏడుసార్లు టీడీపీ విజయం సాధించింది. ఒక్కసారి ఇండిపెండెంట్ గెలుపొందారు. ఈ స్థానం నుంచి కలిదిండి రామచంద్రరాజు 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ నియోజకవర్గం మరో ప్రత్యేకత ఏమిటంటే 1952 నుంచి 1983 వరకు ఏ ఒక్క అభ్యర్థి రెండోసారి గెలుపొందకపోవడమే.
టీడీపీ – వైఎస్సార్‌సీపీ మధ్య పోటీ
ఉండి నియోజకవర్గంలో ఎన్నికల గాలి ఈ సారి ఫ్యాన్ వైపు వీస్తోంది. అధికార పార్టీ లో వర్గపోరు, కుమ్ములాటలు, ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, జన్మభూమి కమిటీల రాక్షసత్వం, అసమర్థ పాలనతో ప్రజలు విరక్తి చెందారు. వైఎస్సార్‌సీపీ తరఫున పీవీఎల్ నర్సింహరాజు, తెలుగుదేశం తరఫున శివరామరాజుల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. జనసేన అభ్యర్థిగా అభ్యర్థి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. టీడీపీ అరాచకాలు తట్టుకోలేక టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రతో ఈ ప్రాంతంలో పార్టీ మరింతగా బలపడింది.
అగ్రగణ్యుల బరి
నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, ఆర్థికవేత్తలు ఈ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టల్ని తీసుకువచ్చారు. రాజకీయ ప్రముఖులు స్వర్గీయ పీవీఎల్, తిమ్మరాజు, కనకరాజు, రామచంద్రరాజు, కుసుమేశ్వరరావు, గోకరాజు రంగరాజు, యర్రా నారాయణస్వామి, కనుమూరు బాపిరాజు, సర్రాజు, పేరయ్య, వెంకట్రాజు, కలిదిండి రామచంద్రరాజు(అబ్బాయిరాజు), విజయ నర్శింహరాజు, విజయకుమార్‌రాజు, సుబ్బతాతరాజు, గాదిరాజు జగన్నాథరాజు తదితరులు ఈ ప్రాంతానికి చెందినవారే. పారిశ్రామికవేత్తలైన సిరీస్ రాజు, గంగతాతరాజు, కె.ఎస్.రాజు, రఘురామకృష్ణంరాజు, కెవీఎస్ రాజు, ‘సత్యం’ రామలింగరాజు, బాబూరావు, నేరెళ్ల రామ్మోహనరావు తదితరులున్నారు. గుండె శస్త్రచికిత్స నిపుణుడు భూపతిరాజు సోమరాజు(కేర్ అధినేత), క్యాన్సర్ వైద్య నిపుణులు సూర్యనారాయణరాజు, డాక్టర్ ఎం.ఆర్.రాజు వంటి ప్రముఖులు కూడా ఈ నియోజకవర్గానికి చెందినవారే.
తాండవిస్తోన్న సమస్యలు
ఉండి నియోజకవర్గంలో అనేక సమస్యలు తాండవిస్తోన్నాయి. ఆరు దశాబ్దాలుగా నియోజకవర్గంలో పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వాలు నిజం చేయలేకపోతున్నాయి. తరాలు వెళ్లినా వారి సొంత ఇంటి తల రాత మారలేదు. కొన్ని కాలనీలు ఏర్పడినప్పటికీ వాటిలో సరైన వసతులు లేవు. మురుగు కూపంలో కాలనీల వాసులు కాలం గడుపుతున్నారు. అలాగే మున్సిపాలిటీ స్థాయికి ఎదిగిన ఆకివీడులో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. కోపల్లె, ఉండి, గరగపర్రులో పురాతన వంతెనలకు మోక్షం లేదు. ఉండిలో ఇప్పటికీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు కాలేదు.
గుక్కెడు నీటి కోసం చెరువైన గుండెలు
ఒక పక్క మంచినీటి సరస్సు.. పంట కాలువల పరవళ్లు, ఇంకో పక్క సముద్రం. అయితే గొంతు తడిచేసుకునేందుకు తాగునీటికి మాత్రం కటకటలాడాల్సిందే. ఆక్వా రంగం నుంచి వచ్చే వ్యర్థాల వల్ల పంట కాల్వలు, మంచినీటి చెరువులు, బోదెలు, భూగర్భ జలాలు, బావులు, బోరుల్లోని జలాలు కలుషితమై మంచినీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రజలు మంచినీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ఈ ప్రాం తం మంచినీటికోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి. బావుల్లో ఉప్పునీరు ఊరి తాగడానికి పనికిరాకుండా పోతోంది. సముద్రతీర ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పుమయమైపోయాయి. గోదావరి నదిపైనే ఆధారపడి జీవించాలి. తాగునీటి కోసం రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment