
సాక్షి, హైదరాబాద్ : దేశ స్థూల ఉత్పత్తి 10 శాతం పెరుగుదలతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అయితే 10 శాతం పెరుగుదల అనేది ప్రశ్నార్థకంగా ఉందని బుగ్గన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బడ్జెట్ నిరాశజనకంగా ఉందన్నారు. రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్షం ఉందని.. కేంద్ర బడ్జెట్‌పై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే అజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని బుగ్గన స్పష్టం చేశారు. కొన్ని ప్రభుత్వ ఆఫీసులను కర్నూలకు తరలించడంలో తప్పేముందన్నారు. చంద్రబాబు చెప్పినట్టు అభివృద్ధి అంతా అమరావతిలోనే జరిగితే.. శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు.
బుగ్గన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 2లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. 2018-19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటా రూ. 2,500 కోట్లు తగ్గించారు. ఈ బడ్జెట్‌లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వ్యవసాయానికి గోదాములు కెపాసిటీ పెంచే ఏర్పాటు, రాజ్యలక్ష్మి గ్రూప్‌లకు ఆర్థిక సాయం, కిసాన్ రైతు పథకాలు బాగున్నాయి. కృషి ఉడాన్ ఏర్పాటు కూడా స్వాగతించ తగిన అంశం. వెనకబడిన జిల్లాల్లో ఆస్పత్రులకు ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్ నిర్ణయం మంచిదే.
గత బడ్జెట్‌తో పోలిస్తే విద్య కోసం మార్జినల్‌గా స్వల్ప కేటాయింపులు ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో రుణ విధాన తరలింపును పొడిగించారు. బ్యాంక్ డిపాజిట్లను భద్రతను రూ. 5లక్షకు పెంచారు. రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ తగ్గించారు. అయితే కొన్ని నిబంధనలను ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ నిరాశజనకంగా ఉంది. 2014లో రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా విభజన జరిగింది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు పూర్తికాలేదు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు.. కానీ ఇప్పటివరకు ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలాంటి హామీ లేదు. వెనకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్ ఇస్తామని చెప్పారు.. కానీ అవి కూడా ఇప్పటివరకు పూర్తిగా రాలేదు. పోలవరానికి సంబంధించిన నిధుల విడుదల కూడా ఆలస్యం అవుతుంది. దుగ్గరాజపట్నం సాంకేతికంగా ఆలస్యమయితే రామాయపట్నం ఇవ్వాలని కోరాం. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రత్యేక హోదా కోసం గత ఐదేళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది.
కానీ రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్షం ఉంది. కేంద్ర బడ్జెట్‌పై స్పందించకుండా.. ప్రభుత్వంపై విమర్శలు చేయడమే టీడీపీ నేతలు అజెండాగా పెట్టుకున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు రూ. 1900 కోట్లు ఆదా చేశాం. ఒక్క పోలవరంలోనే రూ. 782 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయింది. టీడీపీలా దోచుకోకపోవడం మా అసమర్థతా?. దీనికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పాలి. 2014లో రైట్ టైమ్‌లో నిధులు రాకుండా టీడీపీ ప్రభుత్వం కక్కుర్తి పడింది. ఆ తర్వాత డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది. నీతులు చెప్పే టీడీపీ.. రెండేళ్లపాటు ఎందకు పోలవరాన్ని వదిలేసినట్టు?. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పారిపోయారు. పుష్కరాల్లో పంపిణీ చేసిన మంచినీళ్ల ప్యాకెట్లలోనూ అవినీతి చేశారు. ఎన్నికలకు 45 రోజులకు ముందు చేసుకున్న పీపీఏలను మాత్రమే మేము రద్దు చేశాం. 45 రోజుల్లో 41 పీపీఏలను 25 ఏళ్లకు ఎలా చేస్తారు?. టీడీపీ చేసిన తప్పులను ప్రశ్నించినవారు చెడ్డవాళ్లా?. టీడీపీ చేసిన అవినీతి వల్ల.. రాష్ట్రంలో కరెంట్ బిల్లు కట్టే ప్రతి ఒక్కరిపై భారం పడుతోంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన విజ్ఞప్తిని మదిలో పెట్టుకుని అనంతపురంలో ప్లాంట్ పెట్టామని కియా మోటార్స్ సంస్థ అధినేత లేఖ రాశారు. లులు కంపెనీతో ఎలాంటి లాలుచీ లేకుండానే రూ. 20 కోట్ల విలువైన స్థలాన్ని రూ. 20లక్షలకు ఇచ్చారా? రాజధాని సెంటర్‌లో ఉండాలని చెప్పిన వ్యక్తి తుగ్లక్.. ఆయనను ఆదర్శంగా తీసుకునే టీడీపీ పనిచేస్తోంది. అందుకే చంద్రబాబు రాజధానిని సెంటర్‌లో పెట్టాలని అంటున్నారు. తుగ్లక్ తర్వాత రాజధానిని సెంటర్‌లో పెట్టాలని చెప్పింది చంద్రబాబే. చంద్రబాబు హయాంలో అత్యధికంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం నేనే పెద్ద రైతును అని బీరాలు పలుకుతున్నారు. తుగ్లక్ పనులు చేసేది చంద్రబాబే. అధికారంలో ఉన్నవారు ఎప్పుడైనా ధర్నాలు చేయడం చూశామా?. పరోక్షంగా చంద్రబాబును దెబ్బకొట్టడానికే యనమల మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేసిన రూ. 60 వేల కోట్ల అప్పును తీర్చడానికి 6 నెలలుగా కష్టపడుతున్నాం. యనమలకు ఈ విషయం తెలియదా?. దుర్మార్గమైన పాలన చేసిన టీడీపీ.. ఇప్పుడు ఏమీ ఎరగనట్లు మాట్లాడటం హాస్యాస్పదం. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన మండలిలో శాసనసభ చేసిన చట్టాలను అడ్డుకుంటున్నారు. ఇది మంచి సంప్రాదాయం కాద’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment