
కోల్‌కత్తా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శల వర్షం కురిపించారు. ఉత్తర కొరియా నియంత పాలకుడు కీమ్ జోంగ్ ఉన్‌తో పోల్చుతూ.. వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు స్వికరించిన అనంతరం తొలిసారి బిహార్ పర్యటనకు వచ్చిన గిరిరాజ్‌సింగ్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘మమతా బెనర్జీ చాలా ప్రమాదకరమైన నాయకురాలు. ఉత్తర కొరియా నియంత ఉన్‌లా ప్రత్యర్థి నేతలను హతమార్చుతున్నారు. ఆమె రాజకీయ భవిష్యత్తు ఇక ముగిసినట్లు. అందుకే హింసాత్మక ఘటనల ద్వారా భయాందోళనలు సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా.. సమఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు’’అని విమర్శించారు.
కాగా ప్రధాని మోదీ అధ్యక్షతన ఈనెల 15వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించిన విషయం తెలిసిందే. తమ రాష్ట్ర అవసరాలకు మద్దతుగా నిలిచే ఆర్థిక అధికారాలు లేని నీతి ఆయోగ్ వృథా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘రాష్ట్రాల ప్రణాళికలకు ఆర్థికంగా తోడ్పాటునందించే అధికారం లేని నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం దండగని, ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వరని లేఖలో పేర్కొన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమరంతో బీజేపీ నేతలకు, మమత సర్కారుకు పెద్ద పెత్తున విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే.