
పట్నా : బీజేపీ జాగ్రత్తగా ఉండాలని.. త్వరలోనే ఆ పార్టీకి ద్రోహం జరగబోతుందని హెచ్చరించారు రాష్ట్రీయ్ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ. ఈ క్రమంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ నాయకులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ త్వరలోనే దోఖా నం. 2గా మారబోతున్నారు. ఆయన బీజేపీని మోసం చేస్తారు. ప్రజల ఆదేశాన్ని, కూటమి సభ్యులను మోసం చేయడం నితీష్ కుమార్‌కు కొత్తేం కాదు. నితీష్ చేతిలో మోసపోని వారంటూ ఎవరూ లేరు. ఇప్పుడు ఈ సామెత బీజేపీకి వర్తిస్తుంది. త్వరలోనే అతను ఎన్డీఏ కూటమికి ద్రోహం చేస్తాడు’ అని ఉపేంద్ర కుష్వాహ హెచ్చరించారు. గతంలో మేం నితీష్ చేతిలో మోసపోయాం. అందుకే ఇప్పుడు బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం అని తెలిపారు.