
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి నివేదన సభ వేదిక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంలో, ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన ఒక్కమాట కూడా ఆయన నిలబెట్టుకోలేదని, తాను చెప్పిన మాట తప్పినట్లు ప్రజల ముందు ఒప్పుకోవాలని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ సభను ప్రజా ఆవేదన సభగానో.. కేసీఆర్ క్షమాపణల సభగానో నిర్వహిస్తే బాగుండేదన్నారు. శనివారం గాంధీభవన్ నుంచి పార్టీ పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు, మండల, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్లతో ఉత్తమ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా తెలంగాణ సమాజాన్ని లూటీ చేయడం లోనే కేసీఆర్ కుటుంబం నిమగ్నమైందని, అడ్డంగా సంపాదించిన సొమ్మును అడ్డగోలుగా ఖర్చుపెడుతూ విలాస జీవనానికి అలవాటు పడింద ని ఆరోపించారు. ప్రగతి సభ పేరుతో ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, ప్రజా రవాణా కోసం, స్కూళ్లు, కళాశాలల కోసం వినియోగించాల్సిన బస్సుల్లో పార్టీ కార్యకర్తలను తరలిస్తున్నారన్నారు.
ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు..
దళితులకు ముఖ్యమంత్రి పదవి, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూ పంపిణీ, గిరిజనులు, ముస్లిం లకు 12% రిజర్వేషన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇలా ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఉత్తమ్ ఆరోపించారు. ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించకుండా నాటకాలాడుతున్నారన్నారు. వారిని ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు.
ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి
నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనావైఫల్యాలతోపాటు రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు ఉత్తమ్ సూచించారు. ఓటర్ల జాబితా సవరణలు ప్రారంభమైనందున ప్రతి నాయకుడు, కార్యకర్త ఓటర్ల జాబితా చూసుకుని అవసరమైతే సవరణలు చేసుకోవాలని కోరారు. రూ.2 లక్షల ఏకకాల రైతు రుణమాఫీ, రైతు బీమా పథకం, ప్రీమియం చెల్లింపు, పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, మహిళా సంఘాలకు రుణాలు వంటి కాంగ్రెస్ హామీలను ప్రజలకు వివరించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తామని, ఇందుకు సంబంధించిన ప్రీమియం భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తమ్ చెప్పారు.
శనివారం గాంధీభవన్‌లో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
Comments
Please login to add a commentAdd a comment