స్వాతంత్య్రం తెచ్చిన పార్టీనే విలీనం చేస్తారా? | Uttam Kumar Reddy Fires On KCR | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్రం తెచ్చిన పార్టీనే విలీనం చేస్తారా?

Published Fri, Apr 26 2019 1:49 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy Fires On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి స్వాంతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీనే రాష్ట్రంలో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీనే నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో సోనియా గాంధీ కాళ్లు పట్టుకొని తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని ఆయన మర్చిపోయి విలీన ఆలోచన చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులు, ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు గురువారం అఖిలపక్ష నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, టీజేఎస్‌ అధినేత కోదండరాం, టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, సీపీఐ నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో కౌన్సిల్‌ చైర్మన్‌ స్వామిగౌడ్‌ను బెదిరించినట్లే ఇప్పుడు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సీఎం బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందుకే స్పీకర్‌ హైదరాబాద్‌ రావట్లేదని, అనర్హత పిటిషన్‌ తీసుకునేందుకు భయపడుతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఎంఐఎంను నిలబెట్టేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు రూ. కోట్ల ఆశ చూపి, పదవులు ఎరవేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న పద్ధతులను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలన్నారు. మీడియా సైతం ఈ విషయంలో ప్రేక్షకపాత్ర వహించొద్దన్నారు.

మంత్రిని డిస్మిస్‌ చేయాలి...: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో తప్పిదాలు, అవకతవకలు, అవినీతి, బోర్డు వైఫల్యం వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వాటిని ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని గవర్నర్‌ నరసింహన్‌ను కోరినట్లు ఉత్తమ్‌ వెల్లడించారు. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో బోర్డు విఫలమైందని, ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు టెండర్లు కట్టబెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని విమర్శించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్ల క్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కేబినెట్‌ నుంచి డిస్మిస్‌ చేయాలని గవర్నర్‌ను కోరినట్లు ఉత్తమ్‌ తెలిపారు. విద్యార్థుల విషయంలో తాను కఠినంగా ఉంటానని, న్యాయం జరిగేలా చూస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చినట్లు వివరించారు.

రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం: భట్టి
ముఖ్యమంత్రి విపరీత చర్యల కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం నెలకొందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్‌ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, కేసీఆర్‌ ఆగడాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే కేసీఆర్‌ పెను సవాల్‌ విసురుతున్నారన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కావాలనే స్పీకర్‌ చర్యలు తీసుకోవట్లేదని భట్టి ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 29న బోర్డు కార్యాలయం వద్ద అఖిలపక్షం నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ తెలిపారు. ఓ సంస్థ ప్రయోజనాల కోసం లక్షలాది మంది విద్యార్థులతో చెలగాటమాడారని టీజేఎస్‌ అధినేత కోదండరాం విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించిన తీరు బాగాలేదని చెరుకు సుధాకర్‌ విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement