టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు.. | TPCC begins exercise on selection of new president | Sakshi
Sakshi News home page

ఎవరైతే బాగుంటుంది?

Published Thu, Dec 10 2020 4:30 AM | Last Updated on Thu, Dec 10 2020 9:26 AM

TPCC begins exercise on selection of new president - Sakshi

బుధవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌. చిత్రంలో ఉత్తమ్, భట్టి, షబ్బీర్‌ అలీ, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకు రాష్ట్ర పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఉత్తమ్‌ నివాసానికి వెళ్లి తేనీటి విందు అందుకున్నారు. అనంతరం గాంధీభవన్‌కు చేరుకున్నారు. తొలుత విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాణిక్యం.. తర్వాత కోర్‌కమిటీ సభ్యులతో కలసి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక గురించి అభిప్రాయ సేకరణ చేశారు.   
 – సాక్షి, హైదరాబాద్‌

30 నిమిషాలు.. సింగిల్‌ ఎజెండా
టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశం 30 నిమిషాల పాటు ఒకే ఎజెండాతో సాగింది. అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందో చెప్పాలని కోర్‌కమిటీని కోరారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, చిన్నారెడ్డి, కోర్‌కమిటీ సభ్యులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, వీహెచ్‌లు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ఒక్కో నేత నుంచి వ్యక్తిగతంగా టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఠాగూర్‌ అభిప్రాయాలను సేకరించారు. 

పార్టీ నిర్ణయమే ఫైనల్‌ 
విడివిడిగా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల నుంచి మాణిక్యం ఠాగూర్‌ అభిప్రాయాలు తీసుకునే సందర్భంలో అందరు నేతలూ పార్టీ భవిష్యత్‌ సంక్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన పార్టీ నేతల్లో ఒకరిద్దరు మినహా ఎవరూ మీడియాకు తాము చెప్పిన విషయాలను వెల్లడించడలేదు. కోర్‌కమిటీ సమావేశం ముగించుకుని వచ్చిన ఉత్తమ్‌ను మీడియా ప్రశ్నించగా, సోనియాగాంధీ నిర్ణయమే తన నిర్ణయమని చెప్పినట్లు వివరించా రు. జానారెడ్డిని అడగ్గా తన అభిప్రాయాన్ని పార్టీకి చెప్పానని, పార్టీ అంతర్గత వ్యవహారాలు వెల్లడించలేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా అదేతరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చగా, మాజీ ఎంపీ వీహెచ్‌ మాత్రం బీసీలకు ఈసారి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పినట్లు వెల్లడించారు. ఎప్పుడు బీసీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారో నోట్‌ రూపంలో ఇన్‌చార్జికి అందజేసినట్టు ఆయన తెలిపారు. పొన్నాల, పొన్నం, సంపత్, కోమటిరెడ్డి.. అందరూ తమ నిర్ణయం పారీ్టకి చెప్పామని దాటవేశారు. 

నేనెందుకు పార్టీ మారతా: జానారెడ్డి 
ఈ సందర్భంగా జానారెడ్డి పార్టీ మార్పు అంశాన్ని మీడియా ప్రస్తావించింది. దీనిపై మాట్లాడుతూ తాను పార్టీ మారుతానన్న దాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తన పార్టీ మార్పు గురించి ప్రచారం చేస్తున్న మీడియా ఇందుకు సంజాయిషీ చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తాను సీఎం అభ్యర్ధనని, తాను పార్టీ ఎందుకు మారతానని కుండబద్దలు కొట్టారు. కాగా, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా, ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. 

అన్నీ అధిగమించి అధికారంలోకి వస్తాం: మాణిక్యం ఠాగూర్‌ 
కోర్‌కమిటీ సమావేశానికి ముందు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలసి మాణిక్యం ఠాగూర్‌ మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్ష హోదాలో ఉత్తమ్‌ సమర్థంగా పనిచేశారని కితాబిచ్చారు. ఎలాంటి సందర్భంలోనూ ఆయన సహనం కోల్పోకుండా వ్యవహరించారని, కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకు ఉత్తమ్‌ అధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు. కాంగ్రెస్‌ టీం ఇండియా లాంటిదని, మొదట్లో ఓడినా తర్వాత గెలుస్తుందని, అన్ని సమస్యలను అధిగమించి 2023లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై గురు, శుక్ర వారాల్లో రాష్ట్ర పార్టీకి చెందిన 100–150 మంది నేతల అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పారు. ఈ అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్టానానికి ఇస్తానని, కొత్త అధ్యక్షుడిని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమిస్తారని మాణిక్యం స్పష్టం చేశారు. కాగా, గురు, శుక్రవారాల్లో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, ఏఐసీసీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్‌ నేతలతో మాణిక్యం విడివిడిగా సమావేశమవుతారని గాందీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement