ములాఖత్‌లో మంద కృష్ణను కలసి తిరిగి వస్తున్న ఉత్తమ్, కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మానవ హక్కులపై, ప్రజాస్వామ్య ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను, టీడీపీ నేత ప్రతాపరెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో దళిత, గిరిజన, బీసీలపై పోలీసుల దమనకాండ, నిర్బంధం రోజురోజుకూ పెరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయపరమైన హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. మంద కృష్ణ, వంటేరు అరెస్టు పాలకుల దమనకాండకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణకు మంద కృష్ణ రెండు దశాబ్దాలకు పైగా పోరాడుతున్నా.. ఏ ప్రభుత్వమూ ఆయనను జైలులో పెట్టలేదన్నారు. మంద కృష్ణకు బెయిల్ రాకుండా రెండు వారాల పాటు ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు.
నియంత పాలన సాగుతోంది
కేసీఆర్ నియంతలాగా దుర్మార్గమైన, నిర్బంధ పాలనను సాగిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకున్నందుకు దళిత, బీసీ యువకులను చిత్రహింసలు పెట్టారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర కావాలని అడిగిన మిర్చి రైతులను దొంగలుగా చిత్రీకరించి, బేడీలు వేసి జైలులో వేశారని, ఇంతకంటే రాక్షసపాలన ఎక్కడుంటుం దని ప్రశ్నించారు. గజ్వేల్ లో కేసీఆర్‌పై పోటీచేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన ప్రతాపరెడ్డిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగం రాలేదని ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ప్రతాపరెడ్డిపై కేసు పెట్టడం దారుణమన్నారు. హక్కుల సాధన కోసం పోరాటాలు చేయక తప్పని పరిస్థితులను పాలకులే కల్పిస్తున్నారని హెచ్చరించారు. మానవ హక్కుల సాధనకు గవర్నర్ సహా అన్ని వేదికల్లో తాము గొంతు వినిపించినా ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. మందకృష్ణ, ప్రతాపరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేసి, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంపత్, ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీమంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ మల్లురవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ తదితరులున్నారు.
18న టీపీసీసీ భేటీ
ఈ నెల 18న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకురానున్న నేపథ్యం లో పార్టీ వ్యూహంపై చర్చించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment