
హసన్‌పర్తి: ఎన్నికల కోసం వచ్చిన ఈవీఎంలలో టాంపరింగ్ జరిగేలా సాఫ్ట్‌వేర్ అమర్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమారంలో శుక్రవారం జరిగిన మేధావుల ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటికే కొన్ని జిల్లా కేంద్రాలకు ఈవీఎంలు చేరాయని, వాటిని చెక్ చేయించే బాధ్యత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిదేనని చెప్పారు.
ప్రతి ఈవీఎం బటన్‌ను 50 సార్లు నొక్కాలని, అప్పుడు ఈవీఎంలు టాంపరింగ్ చేశారా.. లేదా అనే విషయాలు బహిర్గతమవుతాయని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాం గ్రెస్ నాయకులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈవీఎంల పరిశీలన కోసం అవసరమైతే జిల్లా కాంగ్రెస్ నుంచి అథరైజేషన్ లెటర్ ఇవ్వాలన్నారు.
కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థి ఎంపిక
కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థి ఎంపిక జరుగుతుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. గెలిచే వారికి టికెట్లు ఇస్తామన్నారు. పొత్తులపై ఇతర పార్టీలతో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రేషన్ డీలర్లకు కమీషన్, గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధు పథకం యథావిధిగా కొనసాగిస్తామని ఉత్త మ్ స్పష్టం చేశారు. రైతులకు పంట భీమా పథకాన్ని వర్తింపజేయడం కాకుండా అందుకు సంబంధించిన ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment