
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
లక్నో, ఉత్తరప్రదేశ్ : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముజఫర్‌నగర్ అల్లర్ల కేసును ఎత్తివేయనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 2013లో జరిగిన అల్లర్లపై నమోదైన కేసును ఉపసంహరించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
కేసు స్టేటస్‌పై జిల్లా మేజిస్ట్రేట్‌ను ప్రభుత్వం ఈ మేరకు సమాచారం కోరినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసును ఎత్తివేయాలని కోరుతూ ఓ లేఖను మేజిస్ట్రేట్‌కు రాసినట్లు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.
కేవలం ముజఫర్‌నగర్ అల్లర్ల కేసుపై మాత్రమే కాకుండా.. బీజేపీ ఎమ్మెల్యే ఉమేశ్ మాలిక్‌పై ఉన్న మరో ఎనిమిది కేసులపై కూడా మేజిస్ట్రేట్ ఓపినయన్‌ను ప్రభుత్వం కోరిందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే మాలిక్‌ను సంప్రదించగా ఆయనకు ఈ కేసుల ఎత్తివేత వ్యవహారంపై ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
తనతో పాటు బీజేపీ ఎంపీ భారతేంద్ర సింగ్, కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్, సాద్వీ ప్రచీలపై కూడా కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఆగష్టు 31, 2013న మహాపంచాయత్ వద్ద ప్రచీ చేసిన ప్రసంగం తర్వాత ముజఫర్‌నగర్‌లో అల్లర్లు చెలరేగాయి. వీరితో పాటు బీజేపీ నాయకులు థానా భవన్, షామిలీ, సార్ధానా సంగీత్ సింగ్ సోమ్, ఉత్తరప్రదేశ్ మంత్రి సురేశ్ రానా తదితరులపై కూడా ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులు ఉన్నాయి.