సాక్షి, హైదరాబాద్: తమకు అన్యాయం జరిగిందంటూ సమా వేశం పెట్టుకుని కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకునేంత స్థాయిలో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల తిరుగుబాటును తన రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నానని మాజీ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు.
మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ తన ఇష్టానుసారం పనిచేయని వారిని పక్కనపెట్టి అనుకూల అధికారులను అందలమెక్కించి తాబేదార్లుగా పనిచేయించుకుంటున్నందుకు అసహనంతో కొందరు ఐఏఎస్‌లు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడని, గజ్వేల్‌లో కూడా ఆయన గెలవలేడని చెప్పారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని తాము స్క్రీనింగ్ కమిటీకి చెప్పినట్టు వీహెచ్ వెల్లడించారు.
కాంగ్రెస్ నేతలకు భద్రత పెంచండి
డీజీపీని కోరిన టీపీసీసీ నేతల బృందం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ కీలక నేతలకు భద్రత పెంచాలని టీపీసీసీ నేతల బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరింది. మంగళవారం టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి హర్కగోపాల్ డీజీపీని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలని కోరినట్టు తెలిపారు.
ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 4+4 సెక్యూరిటీ కల్పించాలని కోరామన్నారు. అలాగే విజయశాంతి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్, గూడూరు నారాయణరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, వేణుగోపాల్‌కు మరింత భద్రత కల్పించాలని కోరినట్టు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ.. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment