
గువాహటి : భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి పేరు కనుక గాంధీ కాకపోయి ఉంటే 29 ఏళ్లకే తాను ఎంపీని అయి ఉండేవాడినా? అని ఆయన ప్రశ్నించారు.
గువాహటిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సుల్తాన్‌పూర్ ఎంపీ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘నా పేరు ఫెరోజ్ వరుణ్ గాంధీ. ఇంటిపేరులో గాంధీ లేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉండేవాడినో అందరికీ తెలుసు. ఇంటి పేరు,పేరు ప్రతిష్ఠలు ముఖ్యం కాదన్న ఆయన.. ప్రజలందరికీ సమానహక్కులు లభించాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. అటువంటి దేశాన్నే తాను చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వారిని తొలగించే హక్కు ప్రజలకు ఇవ్వాలని సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకోసం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని(ప్రైవేట్ బిల్లు ద్వారా) సవరించాలని వరుణ్ సూచించారు.
ఒకవేళ అలాంటి అవకాశమే గనుక లభిస్తే రెండేళ్లలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఎంపీలను 75 శాతం దాకా ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రంగమేదైనా సామాన్యులకు మాత్రం అన్ని ద్వారాలు మూసుకుపోయిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్, వ్యాపారం, సినిమాలు.. ఇలా అన్నింటిలోనూ సామాన్యులకు అవకాశాలు అందకుండా పోతున్నాయని అన్నారు.
‘‘ఉదాహరణకు బ్రిటన్‌లో ప్రజల నుంచి లక్ష ఓట్ల సంతకాల సేకరణ ద్వారా ప్రజాప్రతినిధులను తొలగించే అంశంపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టడం లాంటివి చేస్తారు. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితులు మచ్చుకైనా కనిపించటం లేదు. మొన్నామధ్య తమిళనాడు రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇక్కడ దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనలు వ్యక్తం అయ్యాయి. కానీ, అక్కడి ప్రజా ప్రతినిధులంతా తమ జీతభత్యాలు పెంచుకునే విషయంపై ఒకరోజంతా చర్చించాయి. ఇది పరిస్థితి’’ అని వరుణ్ గాంధీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment