
సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ (బీహార్ మినహా) ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించిన వ్యూహకర్త, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన సర్వశక్తులను రాజస్థాన్‌లో ధారపోస్తున్నారు. మూడు బీజేపీ పాలిత హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే ఆస్కారముందని పలు ఎన్నికల సర్వేలు సూచిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్ష కానున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్.. మిగతా రెండు రాష్ట్రాలకన్నా రాజస్థాన్‌లోని వసుంధర రాజె ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీ అధిష్టానంతో సత్సంబంధాలులేని వసుంధర రాజెకు రాష్ట్రంలో ఆరెస్సెస్‌తో కూడా సత్సంబంధాలు లేవు.
పైగా ఆమె పట్ల ఆరెస్సెస్ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో పలుకుబడి కలిగిన పలు కులాలు, వర్గాలకు చెందిన నాయకులంటే కూడా ఆమెకు పడదు. ఆమెతో పడక అనేకమంది బీజేపీ నాయకులే బయటకు వెళ్లారు. మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర సింగ్ సెప్టెంబర్ 22వ తేదీనే బీజేపీకి గుడ్‌బై చెప్పారు. బ్రాహ్మణ శాసన సభ్యుడు ఘన్‌శ్యామ్ తివారీ పార్టీ నుంచి బయటకు వెళ్లి భారత్ వాహిణి పార్టీని ఏర్పాటు చేశారు. జాట్ నాయకుడు, స్వతంత్ర ఎమ్మెల్యే హనుమాన్ బెనివాల్‌కు జాట్లలో మంచి పలుకుబడి ఉంది. ఆయన గత మూడేళ్లుగా వసుంధర రాజెకు వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్నారు. ఇప్పుడు వారంతా ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సచిన్ పైలట్ ఆమెకు గట్టి పోటీనిస్తున్నారు. ఇటు పార్టీ వారిని, అటు ప్రజా నాయకులను ఎవరిని పట్టించుకోకుండా కేవలం బ్యూరోక్రసిని నమ్ముకొని పాలన సాగిస్తుండడంతో వసుంధర రాజె ప్రభుత్వంపై వ్యతిరేకత మరీ పెరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించడం కోసం అమిత్ షా పదే పదే రాజస్థాన్ వస్తున్నారు. పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మంతనాలు జరుపుతూ వ్యూహాలపై వ్యూహాలు రచిస్తున్నారు. అమిత్ షా ప్రోద్బలంతోనే అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని మొన్న శనివారం నాడు వసుంధర రాజె ప్రకటించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నరేంద్ర మోదీ పాల్గొన్న తొలి ఎన్నికల సభలో ఆమె ఈ వాగ్దానం చేయడానికే ఆ రోజున 12.30 గంటలకు జరగాల్సిన విలేకరుల సమావేశాన్ని ఎన్నికల కమిషన్ మూడున్నర గంటలకు వాయిదా వేసిందని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను తెలంగాణతోపాటు డిసెంబర్ ఏడున నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. రాజస్థాన్‌తో పోలిస్తే బీజేపీకి మధ్యప్రదేశ్, ఛత్తీగ్‌గఢ్‌లలో పరిస్థితి మెరుగ్గా ఉంది.
ఆ రెండు రాష్ట్రాలో పార్టీ కాస్త వెనకబడినప్పటికీ ముఖ్యమంత్రులుగా శివరాజ్ సింగ్ చౌవాన్, రమణ్ సింగ్‌లనే ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఏ మాత్రం రాణించినా దాని ప్రభావం రాజస్థాన్‌పై పడుతుందన్న ఆశ. ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబర్ 11 నాటికి ఎలాంటి ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ సోషల్ మీడియా విస్తరించిన నేటి పరిస్థితుల్లో ఓట్ల సరళి తెలిసిపోవడం చాలా తేలిక. నవంబర్ 28న జరిగే మిజోరం ఎన్నికలకు, రాజస్థాన్ ఎన్నికలు జరిగే డిసంబర్ ఏడవ తేదీకి మధ్య ఏకంగా తొమ్మిది రోజుల సమయం ఉంది. అంటే, మిగితా రాష్ట్రాల ఎన్నికలను ముగించుకొని తొమ్మది రోజులు ఒక్క రాజస్థాన్‌పైనే దష్టిని కేంద్రీకరించేందుకు బీజేపీకి అవకాశం చిక్కింది. ఒక్క రాజస్థాన్ ఎన్నికలనే చివరన పెడితే బాగుండదు కనుక తమకు అంతగా ముఖ్యంగానీ తెలంగాణను ఈ రాష్ట్ర ఎన్నికలతో కలిపారు. తెలంగాణలో బీజేపీకి అంతగా పట్టులేని విషయం, తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిస్తే కేంద్రంలో రేపు బీజేపీకే మద్దతిస్తుందని తెలుస్తోంది.
రాహుల్ తప్పటడుగువేస్తే.....
అన్ని విధాలుగా ఓటమి అంచుకు చేరుకున్న వసుంధర రాజె ప్రభుత్వాన్ని పడకొట్టడం కాంగ్రెస్‌కు పెద్ద కష్టమేమి కాదు గానీ స్వీయ తప్పిదాలకు పేరుపొందిన రాహుల్ నాయకత్వం మళ్లీ అలాంటి తప్పులే చేస్తే కష్టమే అవుతుంది. రాహుల్ గాంధీ అహంకారంతో ‘రాహుల్ వర్సెస్ మోదీ’ అన్న ప్రచారాన్ని తీసుకొస్తే కొంప మునిగే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో వసుంధర రాజె అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నరేంద్ర మోదీ అంతగా వ్యతిరేకత లేకపోగా అంతో ఇంతో గౌరవం ఉంది. అందుకని అమిత్ షా కూడా ‘రాహుల్ వర్సెస్ మోదీ’ ప్రచారం జరగాలని కోరుకుంటున్నారు.
అందుకని అమిత్ షా సూచనల మేరకు ఆరెస్సెస్ కార్యకర్తలు వసుంధర రాజెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ నినాదం మనకెందుకని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా ఉండే ‘మోదీ వ్యతిరేక’ నినాదాలు అందుకుంటుందన్నది అమిత్ షా వ్యూహం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు సబంధించి ఇప్పటికే బీఎస్పీకి, ఎస్పీకి దూరమైన రాహుల్ మరో వ్యూహాత్మక తప్పిదం చేయకుండా ఉన్నప్పుడే కాంగ్రెస్‌కు మంచి ఫలితం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment