
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి 74 ఏళ్ల మదన్ లాల్ సాహినిని నియమించడంతో ఈ విషయమై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు గత మూడు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడినట్లయింది. గత ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో జరిగిన రెండు కీలకమైన లోక్‌సభ, ఒక అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయం పొందడంతో అప్పటి వరకు రాష్ట్ర పార్టీ చీఫ్, వసుంధర రాజే వీర విధేయుడు అశోక్ పర్నామీని రాజీనామా చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది. దాంతో ఆయన ఏప్రిల్ నెలలోనే పదవికి రాజీనామా చేశారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ చీఫ్ విషయంలో అమిత్ షాకు, వసుంధర రాజెకు రాజీ కుదరక పోవడంతో ఆ పోస్టు ఇంతకాలం ఖాళీగానే ఉండిపోయింది. అశోక్ రాజీనామా నుంచి ఆ పదవికి జోద్‌పూర్ ఎంపీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఫ్రంట్ రన్నర్‌గా ఉంటూ వచ్చారు. రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిత్వాన్ని ఆరెస్సెస్ కూడా సమర్థించింది. వివాదాస్పద ‘పద్మావత్’ సినిమా విడుదల విషయంలో సరిగ్గా వ్యవహరించని వసుంధర రాజె పట్ల కోపంతో ఉన్న రాజ్‌పుత్ వర్గాన్ని మెప్పించడం కోసం షెకావత్ పేరును అమిత్ షా తీసుకొచ్చారని అప్పుడు అందరూ భావించారు. అయితే ఆయన ప్రతిపాదనను వసుంధర రాజె తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్‌పుత్‌లకు పార్టీ రాష్ట్ర చీఫ్ పదవినిస్తే జాట్‌లను దూరం చేసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. చారిత్రకంగా రాజ్‌పుత్‌లకు, జాట్లకు పడదు.
రాజ్‌పుత్, జాట్లకు చెందిన వారు కాకుండా ఇతర వర్గాలకు చెందిన వారిని తీసుకోవాలని వసుంధర రాజె డిమాండ్ చేయడంతో షెకావత్ ప్రతిపాదనను అమిత్ షా వదులుకోవాల్సి వచ్చింది. చివరకు మూడు నెలల సుదీర్ఘ మంతనాల అనంతరం మదన్ లాల్ సాహిని విషయంలో ఇరువురు నాయకులు ఓ అంగీకారానికి వచ్చారు. పార్టీ పాతకాయిన మదన్ లాల్ సాహినీ ఆరెస్సెస్ మద్దతుదారు. రాష్ట్రంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడు పర్యాయాలు పనిచేశారు. సికార్ జిల్లాకు చెందిన ఆయన ఇటీవలనే ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ జూలై ఏడవ తేదీన రాష్ట్ర రాజధాని జైపూర్ వస్తున్నందున ఆయన వచ్చే నాటికి ఎలాగైనా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న లక్ష్యాన్ని నెరవేర్చారు. రాజస్థాన్‌కు ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment