ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్ విశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్‌లతో కొత్త మంత్రులు సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందిన ధర్మాన కృష్ణదాస్
సాక్షి, అమరావతి/ విజయవాడ పశ్చిమ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొత్తగా నియమితులైన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు బుధవారం రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మధ్యాహ్నం 1.29 గంటలకు వారి చేత ప్రమాణం చేయించారు. కొత్తగా మంత్రివర్గంలో చేరుతున్న వారి పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ప్రకటించారు. తొలుత వేణుగోపాలకృష్ణ, తరువాత అప్పలరాజు ఇద్దరూ దైవసాక్షిగా పదవీ ప్రమాణం చేశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఉపముఖ్యమంత్రిగా నియమితులైన ధర్మాన కృష్ణదాస్, మంత్రులు ఆళ్లనాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
పాదాభివందనాన్ని వారించిన సీఎం జగన్
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వద్దకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌కు పాదాభివందనం చేయబోయారు. ఆయన వెంటనే అడ్డుకుని వారిని వారించారు.
బీసీలకు పెద్ద పీట: ధర్మాన కృష్ణదాస్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గంలోనూ, రాజకీయ పదవుల్లోనూ బీసీలకు పెద్ద పీట వేశారని ఉపముఖ్యమంత్రిగా నియమితులైన ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడారు.
► ఒకేసారి ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత వైఎస్ జగన్‌దే.
► మంత్రివర్గ కూర్పులో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను తీసుకుని అందరికీ సామాజిక న్యాయం చేశారు.
► నాకు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నా.
రాజ్‌భవన్‌లో చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజులతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. చిత్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
చెట్లెక్కే కాళ్లను పార్లమెంటు మెట్లు ఎక్కించారు: శ్రీనివాసవేణుగోపాలకృష్ణ
► శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి సుభాష్ చంద్రబోస్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా చెట్లెక్కే కాళ్లను పార్లమెంటు మెట్లు ఎక్కించిన ఘనత వైఎస్ జగన్‌దే.
► దివంగత రాజశేఖరరెడ్డి 2006, జూలై 22న నన్ను జడ్పీ చైర్మన్‌ను చేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2020, జూలై 22న నన్ను రాష్ట్రమంత్రిని చేశారు.
పారదర్శకతతో పనిచేస్తా: అప్పలరాజు
► నాపై నమ్మకం ఉంచి మంత్రి పదవిని ఇచ్చినందుకు పారదర్శకతతో పని చేస్తా. ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి కృషి చేస్తా.
జడ్పీటీసీ నుంచి మంత్రి పదవి వరకు చెల్లుబోయిన...
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం శంకరగుప్తం శివారు అడవిపాలెంలో చెల్లుబోయిన వెంకన్న, సుభద్రమ్మ దంపతులకు 1962లో శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జన్మించారు. 2001లో రాజోలు జడ్పీటీసీ సభ్యునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2006లో మరోసారి జడ్పీటీసీ సభ్యునిగా గెలిచి, జడ్పీ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీలో పీసీబీ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్సార్‌సీపీలో చేరి, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి 2014లో పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి తోట త్రిమూర్తులుపై విజయం సాధించి, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఏపీ బాక్సింగ్ సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వైద్య వృత్తి నుంచి మంత్రి వరకు సీదిరి...
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో సీదిరి దానమ్మ, నీలయ్య దంపతులకు 1980లో సీదిరి అప్పలరాజు జన్మించారు. పదో తరగతిలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి జనరల్ మెడిసిన్‌లో ఎండీ పట్టా పొందారు. కొంతకాలం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనంతరం 12 ఏళ్లపాటు కాశీబుగ్గలో వైద్యసేవలు అందించారు. 2017లో వైఎస్సార్ సీపీలో చేరి, పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ శాసనసభా కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వాలీబాల్ క్రీడాకారుడి నుంచి డిప్యూటీ సీఎం వరకు కృష్ణదాస్...
గతంలో జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడు అయిన ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాం. ఆయన 1952లో జన్మించారు. విశాఖ బుల్లయ్య కాలేజీలో బీకాం చదివి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో 15 ఏళ్లపాటు ఉద్యోగం చేశారు. 2003లో రాజకీయ ప్రవేశం చేసి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున, 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, విజయనగరం జిల్లా పార్టీ పరిశీలకుడిగా గతంలో పనిచేశారు. 2014లో ఓడినా... మళ్లీ 2019లో గెలిచి మంత్రి పదవి చేపట్టారు. గతంలో జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడు అయిన కృష్ణదాస్ ఐదేళ్ల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ వాలీబాల్ పోటీలకు జాతీయ జట్టు మేనేజర్‌గా పనిచేశారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయనకు సోదరుడు.
సాక్షి, అమరావతి: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదోన్నతి కల్పించారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. శాఖలు కూడా మార్చారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన ఇద్దరు మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు.
► ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి పొందిన ధర్మాన కృష్ణదాస్‌కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలను ఇచ్చారు. ఇటీవలి వరకూ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ వద్ద ఉన్న ఈ శాఖలను.. ధర్మానకు కేటాయించారు.
► మంత్రివర్గం నుంచి వైదొలగిన మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వద్ద ఉండిన పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలను సీదిరి అప్పలరాజుకు కేటాయించారు.
► ఇక చెల్లుబోయినకు బీసీ సంక్షేమ శాఖను ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈ శాఖ మంత్రిగా ఉన్న ఎం.శంకరనారాయణను రోడ్లు–భవనాలు శాఖకు మార్చారు. ఇప్పటి వరకూ మంత్రి హోదాలో ధర్మాన కృష్ణదాస్ రోడ్లు, భవనాల శాఖను చూసేవారు. బోసు, వెంకటరమణారావు రాజీనామాల ఫలితంగా వీరి శాఖలు నిబంధనల ప్రకారం సీఎం వైఎస్ జగన్ వద్ద ఉండేవి. కొత్త మంత్రులు చేరడంతో ఈ మార్పులు అవసరమయ్యాయి.
కొత్త మంత్రుల శాఖలు ఇలా..
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
బీసీ సంక్షేమం
సీదిరి అప్పలరాజు
పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ
పదోన్నతి
ధర్మాన కృష్ణదాస్
డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ
మార్పు ఇలా..
శంకరనారాయణ
రోడ్లు, భవనాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment