
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు పవన్‌కళ్యాణ్ అవసరం కోసం రాజకీయాలు చేస్తుండవచ్చునని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ఎం.విజయశాంతి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విజయశాంతి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన అన్న (చిరంజీవి) వల్లే ఏమీ కాలేదని, తమ్ముడు ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తెలివైనవారని, పవన్ మాటలు వారు నమ్మబోరని అన్నారు. కోదండరాం, మందకృష్ణ వంటి వారికి సమస్యలపై పోరాడే హక్కుందని.. కోదండరాంను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పితే ప్రజలనూ జైల్లో పెడతారా అని ప్రశ్నించారు.
బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ రాష్ట్రాన్ని ఇత్తడి తెలంగాణ చేస్తున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం మినహా రాష్ట్రంలో ఎవరి కుటుంబమూ బంగారుమయం కాలేదని దుయ్యబట్టారు. ఉద్యమంలోని కేసీఆర్ వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వేర్వేరు అని వ్యాఖ్యానించారు. తనను అర్ధరాత్రి సస్పెండ్ చేశారని, ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ చెప్పలేదన్నారు. వ్యక్తిగత పనుల వల్ల కొంతకాలం మౌనంగా ఉన్నానని, ఇక నుంచి పార్టీ కోసం క్రియాశీలంగా పనిచేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేయాలని రాహుల్‌గాంధీ సూచిస్తున్నారని చెప్పారు.