
సాక్షి, తాడేపల్లి : అధికార పార్టీ నేతలను టార్గెట్‌గా చేసుకుని ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు వార్తలను ప్రచురిస్తోందని విశాఖపట్నం ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ విమర్శించారు. అధికార పార్టీ నేతలపై పచ్చి అబద్దాలు రాస్తూ ఆ పత్రిక విలువలను కాలరాస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక తనపై రాసినవి పచ్చి అబద్దాలని, ఆ కథనాలపై ఆధారాలు ఉంటే వెంటనే బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆశ్రమం భూములు వదిలేయాలని తాను ఇతరులను బెదిరిస్తూ లేఖలు రాసినట్లు తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. తాను రాసిన లేఖలు ఉంటే ఆంధ్రజ్యోతి పత్రికా యాజమాన్యం బయటపెట్టాలని సవాలు విసిరారు. తనపై నిందలు వేయడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘అక్రమంగా తాను అపార్టుమెంట్లు కట్టినట్టు వార్తలు రాస్తున్నారు. ఆశ్రమం భూములో ఏమైనా నిర్మాణాలు చేపట్టినట్లు ఉంటే ఆధారాలు చూపించాలి.. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీ అనే కారణంతో నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులుకు ఫిర్యాదు చేసుకోవచ్చు. తపై తప్పుడు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేస్తాం. ఆశ్రమంకు ఎవరైతే భూములు ఇచ్చారో వారే ఆశ్రమ నిర్వాహకులు మీద కేస్ వేశారని అంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద వచ్చిన రెండువేల కోట్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇలాంటి వార్తలు రాస్తున్నారు. పూర్ణానంద సరస్వతి స్వామి ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడు చూడలేదు. పూర్ణనంద సరస్వతిని నేను బెదిరించినట్లు ఆరోపణలు ఉంటే బయటపెట్టాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment