శరద్ పవార్ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి తమ దగ్గర సరైన వ్యూహాలున్నాయని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడలతో కలిసి దేశమంతా పర్యటించి ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని అన్నారు. జాతీయ స్థాయిలో కాకుండా ప్రాంతీయంగా అన్ని పార్టీలతో కూటములను ఏర్పాటు చేయడమే తమ ఉద్దేశమన్నారు. 1975-77 ప్రభుత్వ కాలంలో ఇందిరాగాంధీపై ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకత ఇప్పుడు ప్రధాని మోదీపై మొదలైందని అన్నారు. మోదీ దేశానికి ఏదో చేస్తాడని ఇన్నాళ్లూ ఉన్న భ్రమలు తొలగిపోయాయని ఎద్దేవా చేశారు.
నాడు లోకమాన్య జయప్రకాశ్ నారాయణ్ ఇందిరకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరేలా చేశారని అన్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడంతో ఇందిరాగాంధీ ఓటవి చవిచూడక తప్పలేదనీ, అలా జనతా పార్టీ నుంచి ఎన్నికైన మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్య కూటమి బీజేపీపై విజయం సాధిస్తే ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారని ప్రశ్నించగా.. ప్రస్తుత తరుణంలో సరైన ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీయేనని, అందరూ ఆయనవైపే మొగ్గుచూపుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment