
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే యూపీఏ-3ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ అన్నారు. తమతో కలిసి వచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, వాటి మద్దతుతో కే్ంద్రంలో యూపీఏ-3ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.బీజేపీ కంటే ఎక్కువ స్థానాలనే కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో విజయం సాధించిందని, ఈసారి 160 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని థరూర్ జోస్యం చెప్పారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ఇదివరకే ప్రకటించిన విషయాన్ని థరూర్ గుర్తుచేశారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల మోదీపాలనలో దేశ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అచ్ఛేదీన్ అంటూ ప్రజలను మోసం చేసిన మోదీకి మరోసారి అధికారం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాడుతున్నాయని శశిథరూర్ పేర్కొన్నారు.