పార్టీ ముఖ్య నేతలతో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
పట్నా : అనూహ్య వ్యాఖ్యలు చేసి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ సీనియర్ నేతలకు షాకిచ్చారు. ఆయన గత వారాంతంలో నిర్వహించిన సమావేశాల చివరి రోజున జేడీయూ నేతలను ఉద్దేశిస్తూ 'నేను చనిపోతే పార్టీకి ఏమవుతుంది? ప్రశ్నించారు. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. దాదాపు 215మంది పార్టీ ముఖ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నితీష్ చేసిన వ్యాఖ్యలపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. తమ అధికార పార్టీ మరోసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని, నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు పార్టీ ఒక బాధ్యతగా భావించి సేవలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తాను లేకపోయినప్పటికీ ప్రతిఒక్కరు పార్టీ, ప్రజల విషయంలో బాధ్యతయుతంగా సాగాలని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్‌తో తెగదెంపులు చేసుకొని బీజేపీతో పొత్తుపెట్టుకొని మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు సక్రమంగా లేవు. ఎప్పటి నుంచో కలిసి ఉంటున్న సీనియర్ నేత శరద్ యాదవ్ ఆయనకు దూరమయ్యారు. మరికొందరు నేతలు నితీష్‌ను వ్యతిరేకిస్తున్నారు. క్రమశిక్షణ తప్పిన తీరు పార్టీలో కనిపిస్తోంది. దీంతో నితీష్ అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసింది. అటుపక్క లాలూ తన కుమారులను రాజకీయరంగంలో దింపిన విషయం తెలిసిందే. నితీష్‌కు ఓ కుమారుడు ఉన్నప్పటికీ ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. కాగా, నితీష్ వ్యాఖ్యలపై వశిష్ట నారాయణ్ సింగ్ స్పందిస్తూ మరో పదేళ్ల వరకు నితీష్ కుమార్ తర్వాత ఎవరు అనే విషయం తాము ఆలోచించనక్కర్లేదని అన్నారు. అయితే, నితీష్ వ్యాఖ్యలను కూడా తాము ముఖ్యమైనవిగా పరిగణిస్తున్నామని, పెద్ద పెద్ద బాధ్యతలు అందుకునేలా పార్టీలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.