
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేను అసెంబ్లీలో విప్‌గా నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పేరును విప్ పదవి కోసం ఖరారు చేశారు. ఈయనతోపాటు అసెంబ్లీలో మరో విప్, శాసన మండలిలో నలుగురు విప్‌ల నియామకానికి సంబంధించిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఇప్పటికే ఫిరాయింపులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని ప్రభుత్వం మరింత బరితెగించి అందులో ఒకరిని పార్టీ విప్‌గా నియమించాలని నిర్ణయించడం విశేషం.
అలాగే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మరో ఐదుగురు విప్‌లను నియమించాలని బాబు నిర్ణయించారు. శాసనసభలో ఇప్పటికే నలుగురు విప్‌లుండగా, తాజాగా ఫిరాయించిన సర్వేశ్వరరావు, విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే గణబాబును విప్‌గా నియమించాలని నిర్ణయించారు. మండలిలో విప్‌లుగా బుద్ధా వెంకన్న, ఎంఎ షరీఫ్, రామసుబ్బారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్లను ఖరారు చేశారు. అసెంబ్లీ చీఫ్ విప్‌గా మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, మండలిలో చీఫ్‌విప్‌గా పయ్యావుల కేశవ్‌లను నియమించాలని ఇటీవలే నిర్ణయించారు. ఈ పేర్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ ఆమోదానికి పంపింది.
Comments
Please login to add a commentAdd a comment