సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఐటీ సోదాలు జరుగుతున్న సందర్భంలో ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి కొన్ని ఆరోపణలతో కూడిన డాక్యుమెంట్లు బయటకు రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఎన్నికల అఫిడవిట్, ఐటీ రిటర్నులు, విదేశాల నుంచి నిధులు వచ్చినట్లు చూపిస్తున్న అకౌంట్ నంబర్లు, రియల్ ఎస్టేట్ ద్వారా భూములు పొందిన వివరాలు తదితరాలన్నీ ఈ డాక్యుమెంట్లలో ఉన్నాయి. అయితే ఇవి అధికారికం కాదు... పైగా అందులో ఉన్న అంశాలు, వాటిని పొందుపరిచిన విధానం పూర్తిగా దర్యాప్తు విభాగాలకు ఫిర్యాదు చేసేలా కనిపించాయి. దీంతో అసలు డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు బయటకు వదిలారన్న దానిపై రేవంత్ వర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
కావాలనే సృష్టించారు...
హాంకాంగ్, కౌలాలంపూర్‌లో ఆర్‌హెచ్‌బీ పేరుతో అకౌంట్లున్నట్లు, వాటి ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు డాక్యుమెంట్లలో ఉండటంపై రేవంత్ వర్గం తీవ్రంగా స్పందించింది. అసలు అవి నిజమా.. కాదా.. అనేది తేల్చాల్సింది దర్యాప్తు విభాగాలు అంతేకానీ అంతలోనే మీడియాకు పంపించి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. సోదాలు నిర్వహిస్తున్న ఐటీ చేతిలో ఆరోపణలకు సంబంధించి ఈ డాక్యుమెంట్లు ఉండాలి గానీ బయటకు ఎలా వచ్చాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ద్వారానే ఇవి బయటకొచ్చి ఉంటాయని, ఆయనకు చెందిన వ్యక్తులే ఇలా నకిలీ అకౌంట్ నంబర్లు తదితరాలను సృష్టించి నిందమోపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ఆ ఐటీ రిటర్నులు నకిలీవే...
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐటీ రిటర్నులు, అఫిడవిట్ పత్రాలన్నీ నకిలీవే అని ఐటీ అధికారులతో రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. తన వద్ద ఉన్న ఐటీ రిటర్నులు, సోషల్ మీడియాలో వైరలవుతున్న వాటిని పోల్చి చూడాలని ఆయన అధికారులను కోరినట్లు తెలుస్తోంది. అటు ఐటీ అధికారులు సైతం అసలు ఈ డాక్యుమెంట్లు ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అలాగే వాటిపై తమకు కూడా అనుమానాలున్నాయని, అవి నిజమో.. కాదో.. తేలుస్తామని అధికారులు చెప్పినట్లు రేవంత్‌రెడ్డి సన్నిహితులు స్పష్టంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment